Margadarshi Case Updates: మార్గదర్శి, ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌పై ఒకే విధమైన ఆరోపణలతో కేసులు నమోదు చేయడంపై.. కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏడు జిల్లాల అసిస్టెంట్ రిజస్ట్రార్ ఆఫ్ చిట్‌లకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విచారణను జులై 20కి వాయిదా వేసింది.
ఒకే రకమైన ఆరోపణలతో మార్చి 10న నమోదు చేసిన ఏడు కేసులను కలిపి ఒకే కేసుగా విచారణ చేపట్టాలంటూ.. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏప్రిల్ 17న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పి. గోవిందరెడ్డి.. మార్గదర్శి పిటిషన్లను ఏపీకి బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు.
దానిపై ఈ నెల 5న విచారించిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసిందన్నారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఇదే విషయాన్ని కౌంటరు దాఖలుచేసి చెప్పవచ్చుగా అని ప్రశ్నించారు. మార్గదర్శి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న పిటిషన్లతో జత చేయలేదన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తరువాత ఈ పిటిషన్‌ను పరిశీలిద్దామని, అక్కడ వివాదం ఉన్నప్పుడు ఇక్కడ విచారణ చేపట్టడం సరికాదని న్యాయమూర్తి అన్నారు.
వాదనలు కొనసాగించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది.. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేయాలని కోరారు. తామేమీ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలని గానీ, తేల్చేయాలని గానీ కోరడం లేదన్నారు. సుప్రీం కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత కూడా కౌంటరు నిమిత్తం తిరిగి గడువు కోరే అవకాశం ఉందని, మరింత జాప్యం చేయడానికే ప్రయత్నిస్తారని వాదన వినిపించారు. దీనిపై న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తోపాటు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లపై ఒకే విధమైన ఆరోపణలతో నమోదు చేసిన కేసులపై.. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. విజయవాడ, గుంటూరు, అనంతపురం, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ ఆఫ్ చిట్‌లకు నోటీసులు జారీ చేశారు. వాళ్లందరికీ వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించారు. విచారణను జులై 20కి వాయిదా వేశారు.