బాలిక శరీర భాగాలను దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపులకు పాల్పడినట్టేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది(skin to skin judgement). నిందితునికి పోక్సో చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. బాలిక శరీరాన్ని నేరుగా తాకినా, దుస్తులపై నుంచి తాకినా నిందితునికి లైంగిక వాంఛ ఉందా? లేదా? అన్నదే అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపింది. ఓ బాలికను దుస్తులపై నుంచి తాకిన ఓ నిందితుడికి పోక్సో చట్టం వర్తించదని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును(bombay hc skin to skin judgement) సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా నేరస్థుడికి చట్టం నుంచి తప్పించుకునే అవకాశం కల్పించడం చట్టం ఉద్దేశం కాదని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది(supreme court news).
'శాసనకర్తలు స్పష్టంగా చెప్పినప్పుడు, న్యాయస్థానాలు నిబంధనలో అస్పష్టతను సృష్టించలేవని మేము నిర్ధరించాం. సందిగ్ధం సృష్టించే విషయంలో కోర్టులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది(supreme court latest news).
ఈ కేసులో దోషి తరఫున అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపించగా.. ఆయన సోదరి సీనియర్ అడ్వకేట్ గీతా లుథ్రా జాతీయ మహిళా కమిషన్ తరఫున వాదించారు. ఈ కేసు విషయంలో న్యాయవాది సోదరుడు, సోదరి కూడా పరస్పరం వ్యతిరేకంగా అభిప్రాయాలు కలిగి ఉన్నారని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ కేసు..
మహారాష్ట్రలో 2016లో సతీష్ అనే 39ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా అతడికి పోక్సో చట్టం వర్తించదని తెలిపింది.
'పోక్సో' చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని తీర్పునిచ్చింది(bombay high court judgement on pocso). ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే(skin to skin contact) అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. అయితే నిందితుడికి ఐపీసీ సెక్షన్ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది. ఈ తీర్పు తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై పులువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 27న బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా ఆ తీర్పును కొట్టివేసింది.
ఇదీ చదవండి: Nusrat Jahan: 'ఆ ఎంపీ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు'