Sputnik light vaccine: భారత్‌లో మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోసు వ్యాక్సిన్ 'స్పుత్నిక్-లైట్ అత్యవసర వినియోగానికి భారతీయ ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నెల 31న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఈ మేరకు సిఫారసు చేసినట్లు పేర్కొన్నాయి. దీనికి త్వరలోనే డీసీజీఐ అనుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.
స్పుత్నిక్ లైట్ టీకాను భారత్‌లో అత్యవసర వినియోగానికి, బూస్టర్ డోసుకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తూ చేసుకుంది డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్ పనిచేస్తోందన్న నివేదికను సమర్పించింది. ఆ నివేదికపై సంతృప్తి చెందిన నిపుణుల కమిటీ.. స్పుత్నిక్ లైట్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకి సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. స్పుత్నిక్ లైట్‌కు డీజీసీఐ నుంచి అనుమతి లభిస్తే.. దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది.
ఇదీ చూడండి: వారికి మాస్కు అక్కర్లేదు- ఫుల్ కెపాసిటీతో థియేటర్లు రీఓపెన్