Bihar govt land sold: బిహార్‌లో ప్రజా ఆస్తులకు రక్షణ కరవైంది. పంచాయతీ కార్యాలయాలు, బ్రిడ్జిలు, రైల్ఇంజిన్లు.. ఇలా విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడు. తాజాగా ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పుర్‌లోని మధురాపుర్లో ఉన్న ఓ క్లినిక్‌తో పాటు దానికి ఆనుకొని ఉన్న స్థలాన్ని కూడా అమ్మేశారు. ఆ స్థలం తన కుటుంబ ఆస్తి అని విక్రయించిన వ్యక్తి చెబుతున్నాడు.
స్థలం నేపథ్యమిది..
1995 డిసెంబర్ 8న భూస్వామి రాంవిలాస్ సింగ్.. ఖాతా నెం 85లోని 1303, 1298 నెంబర్లతో నమోదైన భూములను బిహార్ ప్రభుత్వానికి దానం ఇచ్చారు. ఈ స్థలాల్లో ప్రభుత్వాలు ఓ కమ్యూనిటీ హాల్, సబ్ హెల్త్ క్లినిక్‌లను నిర్మించాయి. అయితే రాంవిలాస్ సింగ్ మనవడు మున్నా సింగ్.. 1303 నెంబర్లోని 7 సెంట్ల భూమిని 2021 డిసెంబర్ 8న అదే గ్రామానికి చెందిన హరేంద్ర రాయ్‌కు విక్రయించేశాడు. తాను కొనుగోలు చేసిన స్థలాన్ని వినియోగదారుడు అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ విషయంలో తగాదాలు రాగా.. భూరికార్డులను పరిశీలించారు. దానం చేసిన భూమిని విక్రయించినట్లు రికార్డుల్లో తేలింది. అయితే, తన తాత దానం చేసిన భూమికి అనుబంధంగా ఉన్న స్థలాన్నే తాను విక్రయించానని మున్నా సింగ్ తెలిపారు. అది తమ పేరుమీదే రిజిస్టర్ అయి ఉందని స్పష్టం చేశారు.
"ఇది మా కుటుంబానికి చెందిన భూమి. కమ్యూనిటీ భవనం కోసం ఏడు సెంట్ల భూమిని మా తాత దానం చేశారు. పేపర్ల ప్రకారం వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిలో రెండు సెంట్లు మా పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ, అక్కడి స్థానికులు ఆ భూమంతా ప్రభుత్వానిదేనని అంటున్నారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఏడు సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. భూమిని కొలిచిన తర్వాత ఎంతైతే మిగులుతుందో అది మా పూర్వీకుల ఆస్తి అవుతుంది. దీనిపై వివాదాలు అవసరం లేదు. దీనిపై మేం పేపర్లు కూడా చూపించాం. త్వరలోనే దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం."
- మున్నా సింగ్, భూమిని విక్రయించిన వ్యక్తి
Bihar health clinic sold: ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని.. ఎవరైనా తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని బిహార్ రెవెన్యూ శాఖ మంత్రి రామ్‌సూరత్ రాయ్ తెలిపారు. ల్యాండ్ మ్యుటేషన్లు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతోందని చెప్పారు. మరోవైపు, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ రికార్డులను పరిశీలించకుండానే భూమిని విక్రయించారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తమకు ఫిర్యాదు అందిందని.. భూమిని త్వరలో కొలుస్తామని చెప్పారు.
Bihar rail engine sold: ఇటీవల బిహార్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ముజఫర్‌పుర్ జిల్లాలోని జమరువా గ్రామ పంచాయతీలో హెల్త్ సెంటర్ భవనాన్ని దుండగులు విక్రయించారు. నాలుగున్నర దశాబ్దాలుగా నడుస్తున్న ఆ క్లీనిక్‌ను అమ్మేశారు. మరోవైపు, రైల్వే శాఖలో ఇంజినీర్‌గా పనిచేసే ఓ వ్యక్తి.. ఏకంగా రైలు ఇంజిన్నే అమ్మేశాడు. ఓ ఇన్స్పెక్టర్, హెల్పర్ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా రైలు ఇంజిన్‌ను పాతసామాన్లు కొనే ఓ మాఫియాకు అమ్మేశారు. ఈ వార్త పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
మరో ఘటనలో.. గ్రామ పెద్ద, కార్యదర్శి కలిసి పంచాయతీ భవనాన్నే అమ్మేశారు. బిహార్ రెవెన్యూ మంత్రి రామ్‌సూరత్ రాయ్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగింది. ఈ వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: 80 అడుగుల మరో వంతెన మాయం.. ఈసారి పక్క జిల్లాలో!