Sonia Gandhi ED News: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మూడో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు సోనియా. ఇప్పటివరకు 2 రోజుల్లో సోనియాను 70 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మొదటి రోజు 2 గంటలు, రెండోరోజైన మంగళవారం 6 గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. తమ ప్రశ్నలకు సోనియా గాంధీ వెంటవెంటనే సమాధానాలు చెప్పినట్లు ఈడీ దర్యాప్తు అధికారులు వెల్లడింతారు. నేషనల్ హెరాల్డ్ దినపత్రిక వ్యవహారాల్లో సోనియా పాత్రపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నిరసన కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు వారి వెంట ఉన్నారు. ఈడీ దుర్వినియోగం ఆపాలని నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు పార్టీ నేతలు.
ముంబయిలోని బొరివలిలో ఆ పార్టీ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఏంటీ కేసు?: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.