Sharmila's statement in YS viveka murde case : 'జగన్ నాకు మద్దతివ్వడని ముందే తెలుసు కాబట్టి.. కడప ఎంపీగా పోటీకి ఒప్పుకోలేదు'.. అని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైకి అంతా బాగానే ఉన్నా.. కోల్డ్ వార్ ఉందన్న ఆమె వ్యాఖ్యలు కుటుంబంలో జగన్ వైఖరిపై చర్చ జరుగుతోంది. 'జగనన్న వదిలిన బాణాన్ని' అంటూ.. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతుగా ప్రచారంలో పాల్గొన్న షర్మిలను జగన్ ఎందుకు పట్టించుకోలేదు..? 2019 సాధారణ ఎన్నికల్లో సొంత చెల్లెలికి టికెట్ ఇవ్వకుండా ఎందుకు దూరం పెట్టాడు..? ఇప్పుడు తాజాగా తెరపైకి వస్తున్న అంశాలు.. విస్తృత చర్చకు తావిచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో 259వ సాక్షిగా వైఎస్ షర్మిలను పేర్కొన్న సీబీఐ.. గతేడాది అక్టోబర్లో ఆమె వాంగ్మూలాన్ని సేకరించింది. ఈ సందర్భంగా సీబీఐతో మాట్లాడిన షర్మిల.. కుటుంబానికి సంబంధించి అంతర్గత విషయాలు పంచుకున్నారు. పైపైకి అంతా బాగానే ఉన్నా.. లోలోపల కోల్డ్ వార్ ఉందని వెల్లడించారు.
జగన్ నాకు మద్దతివ్వడని ముందే తెలుసు కాబట్టి.. కడప ఎంపీగా పోటీకి ఒప్పుకోలేదని.., బాబాయి వివేకానంద పదేపదే ఒత్తిడి చేయడంతో చివరకు సరే అన్నానని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. హత్యకు పెద్దకారణమే ఉందన్న షర్మిల.. కుటుంబ, ఆర్థిక కారణాలు ఏమాత్రం కాదని వెల్లడించారు. అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలడటమే కారణమై ఉండొచ్చని చెప్పారు. రాజకీయంగా వారి దారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకొని కక్ష సాధించి ఉండొచ్చని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సీపీఐ చార్జిషీట్లో పేర్కొంది.
గతంలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్.వివేకానందరెడ్డి గొప్ప నాయకుడని కొనియాడారు. వివేకాను అతి దారుణంగా హత్య చేశారని, కేసు దర్యాప్తు ఇన్నేళ్లు కొనసాగిస్తే.. పోలీస్ వ్యవస్థ, సీబీఐపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు. మా చిన్నాన్న పేరుపై ఆస్తులు లేవు... వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పలు సందర్భాల్లో స్పందించారు. ఆస్తి కోసమే వివేకాను ఆయన అల్లుడు హత్యచేశాడు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో షర్మిల స్పందించారు. తన చిన్నాన్న వివేకా పేరు మీద ఎప్పుడూ ఆస్తులు లేవని, ఆస్తులన్నీ ఎప్పటినుంచో సునీత పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. సునీత పేరు మీద ఆస్తులు ఉంటే.. వేరే వారికి ఎలా రాయగలరని, వేరే వాళ్లకు రాస్తారనడంలో అర్థమే లేదని చెప్పారు. వివేకా తన పేరిట ఉన్న అరకొర ఆస్తులు కూడా సునీత పిల్లలకే రాసి ఇచ్చారని షర్మిల వెల్లడించారు.