ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో రైతులు మూడు వాహనాలను తగలబెట్టారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేయటం వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘర్షణలో మరో నలుగురు చనిపోయారు. మొత్తంగా నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
లఖింపుర్ ఖేరీ జిల్లా బన్బీర్లోని ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారం పాల్గొనాల్సి ఉంది. వేదిక వద్దకు మంత్రి మిశ్రా అప్పటికే చేరుకోగా.. ఉపముఖ్యమంత్రి ఇంకా రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న రైతులు.. టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నల్లజెండాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
'సుప్రీంకోర్టే విచారణ జరపాలి'
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు.. దేశంలోని అన్ని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన చేపట్టేందుకు పిలుపునిచ్చాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ నిరసన కొనసాగనున్నట్లు వెల్లడించాయి. లఖింపుర్ ఘటనకు సంబంధించి దర్యాప్తును సుప్రీంకోర్టే విచారణ చేపట్టాలని.. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను వెంటనే పదవిలోంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు మృతిచెందారని పేర్కొన్నారు.
'నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్'
మంత్రుల కాన్వాయ్‌లో తన కుమారుడు ఉన్నాడన్న రైతుల ఆరోపణలను ఖండించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా. తన కుమారుడు సభ జరగాల్సిన ప్రాంతంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముగ్గురు భాజపా కార్యకర్తలు సహా ఓ కారు డ్రైవర్‌ను కూడా కొందరు చంపారని ఆరోపించారు.
దురదృష్టకరం..
లఖింపుర్ ఘటన దురదృష్టకరం అని అన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. ఈ ఘటన లోతైన దర్యాప్తు చేపడతామని.. ఘర్షణకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
టికాయిత్..
ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. ఘటన జరిగిన సమయంలో రైతులు నిరసన విరమించి తిరిగివెళ్తున్నారని.. అదే సమయంలో వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కొంత మందిపై నుంచి వాహనాలు దూసుకెళ్లాయన్నారు.
లఖింపుర్‌లో పర్యటించేందుకు టికాయిత్ శనివారం పయనమయ్యారు.
ప్రతిపక్షాల విమర్శలు..
లఖింపుర్ ఘటనను ప్రతిపక్షాలు ఖండించాయి.
'ఇది అమానవీయ ఘటన. భాజపా వైఖరిని యూపీ ప్రజలు ఇంక ఏ మాత్రం సహించరు'
-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్
'ఈ అమానవీయ ఘటన జరిగిన తర్వాత కూడా స్పందించకుండా ఉన్నవారు ఇప్పటికే చచ్చిపోయినట్టు లెక్క. ఈ త్యాగాలు వృథా కానివ్వం. కిసాన్ సత్యాగ్రహ జిందాబాద్'
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
లఖింపుర్‌లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. సోమవారం పర్యటించనున్నారు.
ఇదీ చూడండి : 'నాతో రన్నింగ్ రేస్‌కు రా'.. సీఎంకు ప్రతిపక్ష నేత సవాల్