Maharashtra political crisis: శివసేన నేత, రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్ శిందే తిరుగుబావుటాతో తలెత్తిన రాజకీయ సంక్షోభం సహా భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సమావేశమైన శివసేన జాతీయ కార్యవర్గం.. 6 తీర్మానాలను ఆమోదించింది. పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు పూర్తి అధికారమిచ్చింది. శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పేరును ఇతర రాజకీయ సంస్థలు ఉపయోగించరాదని తీర్మానించింది. శివసేన బాల్‌ఠాక్రేకు చెందిందని, హిందుత్వ, మరాఠీని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ మార్గం నుంచి శివసేన ఎప్పటికీ వైదొలగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
మరోవైపు శిందే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సైతం తాము ఉంటున్న గువాహటిలోని హోటల్‌లో భేటీ అయ్యారు. తాము ఇప్పటికీ శివసేనలోనే ఉన్నామని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ స్పష్టం చేశారు. తమకున్న 2/3 మెజారిటీతో కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు చెప్పారు. శివసేన వద్ద 17 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు లేరని వివరించారు. తమ వర్గానికి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టుకున్నట్లు దీపక్ కేసర్కర్ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. తమ కార్యాలయాలు, కుటుంబాలకు భద్రత ఉపసంహరించుకోవడంపై తిరుగుబాటు నేత శిందే సీఎం ఠాక్రేకు లేఖ రాశారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలను, వారి కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ట్వీట్ చేశారు.
డిప్యూటీ స్వీకర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ 33మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఈ మేరకు తనకు వ్యతిరేకంగా రెబల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తిరస్కరించారు. 33మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసినా.. గుర్తు తెలియని మెయిల్ నుంచి పంపారన్న కారణంతో తిరస్కరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
అటు.. జాతీయ కార్యవర్గ భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు శివ సైనికులు ఓర్పుతో ఉన్నారన్న ఆయన.. సమయం గడుస్తున్నకొద్దీ వారి సహనం నశిస్తోందన్నారు. ఇంకా వారు బయటకురాలేదని.. ఒకవేళ వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని రౌత్ హెచ్చరించారు. శిందే వర్గం ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్ బిల్లు ఎవరు చెల్లిస్తున్నారని ఎంవీఏ భాగస్వామి ఎన్సీపీ ప్రశ్నించింది. ఎక్కడి నుంచి నల్లధనం వస్తుందో తేల్చాలని ఐటీ, ఈడీలను కోరింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జిల్లాల్లో శివసేన కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారు. పుణెలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు.
ప్రస్తుత పరిణామాలతో పోలీసులు మహారాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబయి, శిందే కంచుకోటగా ఉన్న ఠానెలో 144 సెక్షన్ విధించారు. ఠానేలోని ఏక్‌నాథ్ శిందే నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబయిలో హై అలర్ట్ ప్రకటించిన హోంశాఖ, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: మంత్రి ఇంటి ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా