Bihar Twins Murder : బిహార్‌లోని గయాలో హృదయవిదారక ఘటన జరిగింది. మద్యం మత్తులో కన్నతండ్రే కసాయి వాడిగా మారి ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కవలల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత చిన్నారుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నందున అతడి కోసం గాలిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
మగద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మగద్ కాలనీలో దేవేశ్ శర్మ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటికి వచ్చి.. అర్ధరాత్రి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో భార్యను కొట్టిన దేవేశ్.. ఆ తర్వాత తన నాలుగు నెలల కవల పిల్లలను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. అయితే ఘటన అర్థరాత్రి జరిగినందున.. పోలీసులు గురువారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లి వద్ద వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు..
బస్ కోసం వెయిటింగ్.. స్కూల్ విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు..
దిల్లీలోని ఆగ్రా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కన నిల్చున విద్యార్థులను.. అతివేగంతో వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.చిన్నారులను కారు ఢీకొన్న ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు ఫతేహాబాద్- ఆగ్రా రహదారిని దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద స్థలిలో ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేస్తామన్నారు.
ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీలోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బరేలీ- లఖ్‌నవూ హైవే పక్కనున్న అశోకా ఫోమ్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం వల్ల భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు సజీవదహనం కాగా.. మరో ఆరుగురు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని శిథిలాల కింద ఇరుకున్న క్షతగాత్రులను వెలికితీశారు. వారందరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఘటన జరుగుతున్న సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు.
గ్యాస్ లీక్‌తో చిన్నారుల అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పంజాబ్- హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని నంగల్ ప్రాంతంలో పీఏసీఎల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న ప్రాంతంలోని చిన్న పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి గొంతునొప్పి, తలనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.