Same Sex Marriage Supreme Court : స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఏకం చేస్తూ సుప్రీంకోర్టుకే బదిలీ చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏకం చేసిన పిటిషన్లన్నింటిపైనా ఫిబ్రవరి 15లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది. పిటిషనర్ విచారణకు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయిన పక్షంలో.. వర్చువల్ పద్ధతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది. పిటిషనర్లు, కేంద్రం ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది.
అంతకుముందు స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నాలుగు వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను చెప్పాలని సూచించింది. దిల్లీ హైకోర్టులో సంబంధిత కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దిల్లీ హైకోర్టులో ఈ కేసు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఇది చాలా ముఖ్యమైన అంశమని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కేసు ప్రభావం చూపుతుందని అన్నారు. తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.
'గడువుకు కట్టుబడి ఉన్నాం'
న్యాయమూర్తుల నియామకం అంశంపైనా శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కొలీజియం ప్రతిపాదించిన జడ్జీల నియామకాలపై విధించిన గడువుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కొలీజియం 104 మందిని ప్రతిపాదించిందని.. ఈ వారంలోగా వివిధ న్యాయస్థానాలకు సూచించిన 44 మంది జడ్జీలను నియమిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానానికి ప్రతిపాదించిన ఐదుగురు జడ్జీల నియామకంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ప్రశ్నించింది సుప్రీం. దీనిపై స్పందించిన ఏజీ.. ప్రస్తుతానికి ఈ అంశాన్ని వాయిదా వేయగలరా అని కోరగా.. సుప్రీం అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సర్వోన్నత న్యాయస్థానానికి ప్రతిపాదించింది.
ఇవీ చదవండి: 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను ఉగ్రసంస్థగా ప్రకటించిన కేంద్రం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ..
జైనుల ఆందోళనలకు దిగొచ్చిన సర్కార్.. శ్రీ సమ్మత్ శిఖరాజి తీర్థంపై కీలక ఆదేశాలు!