1439 Crores Heroin Seize In Gujarat: గుజరాత్‌లోని కాండ్లా పోర్టులో భారీ మొత్తంలో హెరాయిన్‌ను పట్టుకున్నారు. సుమారు రూ. 1439 కోట్ల విలువ గల 205 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ సంస్థ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు తరలిస్తుండగా కాండ్లాలో పట్టుకున్నారు.
హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న సరఫరాదారుడిని గుర్తించేందుకు డీఆర్ఐ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు.. పంజాబ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నాడు. అయితే, సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లగా.. పారిపోయేందుకు యత్నించాడు. ఎట్టకేలకు అతడ్ని పట్టుకున్న అధికారులు.. ఎన్డీపీఎస్ చట్టం1985 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Heroin Seize In Gujarat: ఇదిలా ఉంటే గుజరాత్లో మరోచోట.. 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను పట్టుకుంది భారత తీరప్రాంత రక్షణ దళం. భారత్ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ ఆపరేషన్‌ను చేపట్టారు.
రెండు దళాలు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్‌లో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను.. కచ్ జిల్లాలోని జకావూ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థానీ బోట్ 'అల్ హజ్' భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు తీర ప్రాంత రక్షణ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ప్రియురాలిని మోసం చేసిన ప్రముఖ నటుడు అరెస్ట్