Rope Car Accident In Jharkhand: ఝార్ఘండ్‌లోని దేవ్‌ధర్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్‌వే కేబుల్ కార్లు ఢీ కొన్న ఘటనలో సహాయ చర్యలు ముగిశాయి. కేబుల్ కార్లలో దాదాపు 60 మందిని కాపాడారు. మంగళవారం సహాయకచర్యలు జరుగుతుండా రోప్ జారి మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3కు పెరిగింది. ఆదివారం సాయంత్రం ఘటన జరగ్గా.. 40 గంటలకు పైగా శ్రమించిన సిబ్బంది సహాయక చర్యలు పూర్తి చేశారు. గాయపడ్డ 12 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు.. ఈ ఘటనపై ఝార్ఖండ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
భారత వైమానిక దళం, ఆర్మీ, ఐటీబీపీ, విపత్తు నిర్వహణ దళం సహా స్థానిక పోలీసులు ఈ సహాయక చర్యలు చేపట్టారు. వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొన్నాయి. అయితే.. సహాయక చర్యల్లో భయానక ఘటన జరిగింది. వైమానిక దళ సిబ్బంది కేబుల్ కార్ల నుంచి ప్రయాణికులను రక్షించే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఆర్మీ చేపట్టిన సహాయక చర్యల్లో ఒక యువకుడు మరణించగా.. మంగళవారం మరో మహిళ రోప్‌వే నుంచి జారిపడి మృతిచెందింది. కేబుల్ కార్లు నిలిచిన చోటు.. భూఉపరితలం నుంచి గరిష్ఠంగా 15,00 మీటర్ల వరకు ఎత్తు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కిందపడ్డ బాధితులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. బాధితులు కిందపడిపోతుండగా.. ఆ దృశ్యాలను చూస్తున్నవారి హాహాకారాలు వీడియోలో వినిపించాయి.
ఝార్ఖండ్ దేవ్‌ధర్‌లోని బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వచ్చే ప్రజలు.. 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతాల్లోని రోప్‌వే వద్ద పర్యటిస్తుంటారు. ఈ త్రికూట్‌పర్వతాలలోని ఉన్న 766 మీటర్ల పొడవైన వర్టికల్‌రోప్‌వే.. దేశంలోనే అత్యంత ఎత్తైన రోప్‌వేగా ఉంది. అయితే ఆదివారం సాయంత్రం ఆ రోప్‌వే ద్వారా నడిచే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. సాంకేతిక లోపంతో కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. అనంతరం విద్యుత్తు సరఫరా నిలిచిపోయి.. ఎక్కడి కార్లు అక్కడ ఆగిపోయాయి. దాదాపు 60 మంది రోప్‌వే క్యాబిన్లలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారిలో సోమవారం వరకు 32 మందిని రక్షించారు. ఇవాళ మిగతా వారిని రక్షించారు. గాయపడ్డ 12 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం సుమారు 40 గంటల పాటు సహాయక చర్యలు నిర్వహించారు.
అటు.. ప్రమాద ఘటనపై గవర్నర్ రమేశ్ బయాస్, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సీఎం హేమంత్ సోరెన్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆర్మీ సహాయక చర్యల్లో హెలికాప్టర్ నుంచి జారిపడ్డ యువకుడు