Medak Road accident Today : తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు జనాలను కలవరపెడుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారి(44) వల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుంచి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో బంధువులు చనిపోవడంతో ఇవాళ 10 రోజుల పెద్దకర్మ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఈ కుటుంబం.. కొంతకాలం క్రితం నిజామాబాద్ జిల్లా ఆలూరుకు బతుకుదెరువు కోసం వెళ్లారు. ఈరోజు ఉదయం ఆలూరు నుంచి బయలుదేరి రాగా నార్సింగి శివారులో వెనక నుంచి వస్తోన్న కారు అతివేగంగా ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శేఖర్(45), అతని కుమారుడు యశ్వంత్ (10)తో పాటు మరో ఇద్దరు వృద్ధ దంపతులు బాల నర్సయ్య (70), మణెమ్మ (62), అక్కడికక్కడే మృతి చెందారు.
Four Killed in Medak Road Accident : కవిత, అవినాశ్ అనే తల్లీకుమారులకు గాయాలు కాగా.. వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ కవిత పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వలస కూలీలు మృతి..: కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. జిల్లాలోని కొండగట్టు దొంగలమర్రి వద్ద మామిడికాయల లోడుతో వెళుతున్న గూడ్స్ వ్యాన్ వెనుక టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉపాధి కోసం మధ్యప్రదేశ్ నుంచి నెల రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు వచ్చిన కూలీలు శనివారం ఉదయం మామిడికాయలు తెంపడానికి కరీంనగర్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు మృతి..: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. మృతులు గాంధీపురం గ్రామానికి చెందిన శివ (22), కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన సాయి (19)గా గుర్తించారు. మృతి చెందిన వారు ఇద్దరు యువకులు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కుమారులు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో రోదనలు మిన్నంటాయి.
కారు బీభత్సం..: ఇక.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్లో 65వ నెంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగ నియంత్రణ కోల్పోయిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ దూసుకెళ్లింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. కారు వేగంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కార్ డ్రైవర్ వేగ నియంత్రణ పాటించకుండా వాహనం నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: