Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఎంపిక చేయకూడదంటూ సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 76 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని అందించారు. ముందుగా మంత్రి శాంతి ధరివాల్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. సుదీర్ఘ చర్చల అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పటివరకు ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆదివారం 90 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి 76 మందే రాజీనామా చేశారు. సచిన్ పైలట్‌ను సీఎంగా నియమిస్తే తాము ఆమోదించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆయన ప్రయత్నించారని.. అటువంటి వ్యక్తికి అధికారం అప్పజెప్పకూడదని స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అధిష్ఠానం చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో ముందుండి నడిపించిన ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ అబ్జర్వర్లు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను అధిష్ఠానం రంగంలోకి దించింది. అయితే, బుజ్జగింపు ప్రయత్నాలేవీ సఫలం అయినట్లు కనిపించడం లేదు. ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎల్పీ భేటీ జరగాల్సి ఉండగా.. గహ్లోత్ మద్దతుదారులెవరూ సమావేశానికి రాలేదని సమాచారం. పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలు భేటీకి హాజరయ్యారు. అయితే, అందరు ఎమ్మెల్యేలు రానందున సమావేశం రద్దైంది. సీఎల్పీ భేటీ కాకుండా గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా కలిసేందుకూ ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి ప్రయత్నించారు. మంత్రులు శాంతి ధరివాల్, ప్రతాప్ సింగ్ ఖచారియావాస్, మహేశ్ జోషి, ముఖ్యమంత్రి సలహాదారుడు సన్యం లోధాతో భేటీ అయ్యారు. అయినప్పటికీ రాజీనామాపై సందిగ్ధం వీడలేదు. ఎమ్మెల్యేలకు సమస్య ఉంటే వ్యక్తిగతంగా అయినా వచ్చి తమను కలవాలని మాకెన్ కోరారు.
కొత్త అధ్యక్షుడు వచ్చాకే సీఎంపై నిర్ణయం..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మూడు డిమాండ్లు అధిష్ఠానం ముందుంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజస్థాన్ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోకూడదని, కొత్త సీఎం ఎంపికపై గహ్లోత్ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కోరినట్లు వివరించాయి. గహ్లోత్ వర్గానికి చెందిన 102 మంది ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాయి. "మేం రాజీనామా చేసి ఇంటికి వెళ్తున్నాం. కొత్త సీఎంపై విషయంలో ఏ నిర్ణయమైనా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు" అని మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ తెలిపారు. 'ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే' అని స్వతంత్ర ఎమ్మెల్యే బాబులాల్ నగర్ పేర్కొన్నారు. కాగా, ఈ డిమాండ్లను పార్టీ అధినేత్రి సోనియాకు చేరవేస్తామని అజయ్ మాకెన్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న గహ్లోత్.. రాజస్థాన్ సీఎం పదవికి సచిన్ పైలట్‌ను కాదని ఇతరులను తన వారసుడిని చేయాలని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సైతం అయిష్టంగానే పోటీ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం పదవిని వదులుకోవడానికి గహ్లోత్ ఇష్టపడటం లేదని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆయన.. సీపీ జోషి లేదా మరెవరినైనా సీఎంను చేయాలని, పైలట్‌కు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పైలట్ మద్దతుదారులు 'సత్యమేవ జయతే' అని ఉన్న పోస్టర్లను జోధ్‌పుర్‌లో ఏర్పాటు చేశారు. పైలట్ ఫొతో ఉన్న ఫ్లెక్సీపై.. 'నూతన యుగం తయారవుతోంది' అని నినాదాలు రాశారు.
'ఏంటీ నాటకాలు?'
కాగా, కాంగ్రెస్‌లో ముసలంపై భాజపా విమర్శలు గుప్పించింది. 'ఈ డ్రామాలు ఏంటి? కొన్నిరోజులు వీరు(ఎమ్మెల్యేలు) హోటల్లో ఉంటారు. కొన్నిసార్లు వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రభుత్వం అంతర్గత సమస్యలతోనే సతమతమవుతోంది. ఇంతకంటే దురదృష్టకరమైన ప్రభుత్వం ఇంకోటి ఉండదు. తొలిసారి ఎమ్మెల్యేలు వారి హైకమాండ్‌ను ధిక్కరించారు. అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి' అని రాజస్థాన్ భాజపా ఎమ్మెల్యే, అసెంబ్లీలో డిప్యూటీ విపక్షనేత రాజేంద్ర రాఠోడ్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు.. భాజపాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.