ముంబయి తీరంలో క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై (Mumbai Rave party news) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న అనుమానంతో తనిఖీలు చేసింది. శనివారం అర్ధరాత్రి ఈ పార్టీ జరిగింది. కొకైన్, హషీష్, ఎండీ వంటి మాదకద్రవ్యాలు పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఓ సూపరస్టార్ కుమారుడు సైతం ఇందులో ఉన్నట్లు తెలిపాయి.
మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపింది. పార్టీ ఆర్గనైజర్లకు సమన్లు జారీ చేసింది. ఆదివారం ఉదయం 11 లోగా కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
సముద్రం మధ్యలో పార్టీ
విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎన్సీబీ అధికారులు.. తమని తాము ప్యాసింజర్లుగా పరిచయం చేసుకొని నౌకలోకి ప్రవేశించారు. ఈ నౌక గోవాకు వెళ్లినట్లు తెలిపారు. ముంబయి తీరం నుంచి నౌక బయల్దేరి సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీ ప్రారంభమైందని చెప్పారు.
ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న కొందరిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సెలెబ్రిటీలు ఎవరైనా పార్టీలో ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు వాంఖెడే. దానిపై మాట్లాడలేనని చెప్పారు.
ఇదీ చదవండి: డ్రగ్స్ దందాలో 'సింగం' నటుడు అరెస్టు