2024 Elections Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. రాహుల్ కేవలం ప్రతిపక్షాల ఫేస్ మాత్రమే కాదని.. ఆయన కాబోయే ప్రధాన మంత్రి అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరెవ్వరూ చేయలేదన్నారు. అధికారం కోసం రాహుల్ రాజకీయాలు చేయట్లేదని, ప్రజల కోసం మాత్రమే చేస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ 'భారత్ జోడో యాత్ర' లాంటి పెద్ద పాదయాత్ర చేయలేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పార్టీలోకి వస్తే ఆహ్వనిస్తారా అన్న ప్రశ్నకు.. "నేను ఏ వ్యక్తి గురించి వ్యాఖ్యానించను. కానీ పార్టీకి మోసం చేసిన ద్రోహులకు మళ్లీ స్థానం లేదు" అని కమల్నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని.. కాబట్టి భాజపా ముఖ్యమంత్రిని మార్చుకోవచ్చన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడతామని తెలిపారు.
వచ్చే ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో భాజపా నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.