Punjab Election 2022: పంజాబ్‌లో అమరీందర్ సింగ్ ప్రభుత్వాన్ని దిల్లీలోని భాజపా నడిపించిందని ఆరోపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. అందుకే అమరీందర్‌ను తొలిగించాల్సి వచ్చిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 'ఆర్ఎస్ఎస్'నుంచి ఆవిర్భవించిందని తీవ్ర విమర్శలు చేశారు ప్రియాంక. పంజాబ్‌లోని కొట్కాపురాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీలో చేసిందేమీ లేదని.. అది ఒక 'ఓటమి పాలైన ప్రభుత్వం' అని మండిపడ్డారు.
"ఆమ్ఆద్మీ పార్టీ దిల్లీ మోడల్ అంటోంది. భాజపా కూడా గుజరాత్ మోడల్ అంటూనే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీల నిజస్వరూపం ఇప్పుడు ప్రజల ముందు ఉంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆవిర్భవించింది. భాజపా సిద్ధాంతాన్నే ఆప్ ఆచరిస్తోంది" అని ప్రియాంకా గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీపై నిప్పులు చెరిగారు.
'దిల్లీ నుంచి నడిపించారు...'
అమరీందర్ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వం దిల్లీ నుంచి నడిచిందని ఆరోపించారు ప్రియాంక.
"ఐదేళ్లపాటు మా ప్రభుత్వం పంజాబ్‌లో ఉంది. కానీ ఎక్కడో తప్పు జరిగింది. ఆ ప్రభుత్వం పంజాబ్ నుంచి పరిపాలించడం ఆగిపోయింది. దిల్లీ నుంచి నడవడం మొదలు పెట్టింది. అది కూడా కాంగ్రెస్‌తో కాదు భాజపా నేతృత్వంలో! ఆ విషయాన్ని గ్రహించే ఆ ప్రభుత్వాన్ని మార్చాం" అని మాజీ సీఎం అమరీందర్ సింగ్, భాజపాపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రియాంకాగాంధీ.
చన్నీ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడని.. అధికారంలోకి వచ్చిన 100-150 రోజుల్లోనే ఎంతో చేశారని అన్నారు. ఆప్ రూపంలో మళ్లీ దిల్లీ నుంచి పంజాబ్‌ను శాసించాలని భాజపా చూస్తోందని.. అందుకే ఆప్‌కు మద్దతు ఇవ్వొద్దని ప్రియాంకా గాంధీ సూచించారు.
చన్నీ నాయకత్వంలో పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ. 20 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.
ఇవీ చూడండి: