UP election 2022 news: భారత్‌కు కరోనా మూడో ముప్పు పొంచి ఉండటం సహా ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రానికి, ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది అలహాబాద్ హైకోర్టు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కనీసం 2 నెలల పాటు వాయిదా వేయాలని పేర్కొంది. అదే సమయంలో రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సమావేశాలను నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలకు సన్నద్ధమవడం కష్టమని భావించిన హైకోర్టు.. వార్తాపత్రికలు, టీవీల్లో వర్చువల్‌గా ప్రచారాలు చేసుకోవాలని తెలిపింది. అప్పుడే మూడో దశకు అడ్డుకట్ట వేయగలుగుతామని అభిప్రాయపడింది.
"ఎన్నికల ర్యాలీలను తక్షణమే నిలిపివేయకపోతే.. ప్రస్తుత పరిస్థితులు కొవిడ్ రెండో దశ కన్నా దారుణంగా మారతాయి. ప్రాణాలతో బతికుంటేనే కదా ఏదైనా చేయగలము. భౌతిక దూరాన్ని పాటించకుండా, ఇష్టానుసారంగా గుమిగూడటం వల్లే రెండో దశను భారత్ చూడాల్సి వచ్చింది. వివిధ రాష్ట్రాల పంచాయతీ ఎన్నికలు, బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేసులు భారీగా పెరిగిపోయాయన్నది వాస్తవం. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో కొవిడ్ ఉద్ధృతి పెరగడం ఆందోళనకర విషయమే. అందుకే ఎన్నికలను వాయిదా వేయాలి," అని జస్టిస్ శేఖర్ యాదవ్ సూచించారు.
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలకు వెళ్లనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయా పార్టీల సభలకు ప్రజలు కూడా భారీ సంఖ్యల్లో తరలివెళుతున్నారు.
రాష్ట్రాలకు కేంద్రం లేఖ...
Omicron news India: దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నైట్ కర్ఫ్యూ..
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి రాత్రి కర్ఫ్యూ(నైట్ కర్ఫ్యూ) విధిస్తున్నట్లు తెలిపింది. ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఇవీ చూడండి:-