Police Pickets at Nara Bhuvaneshwari Brahmani Camps: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని అణచివేయటానికి చర్యలు చేపడ్తూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతు తెలపటానికి రాజమహేంద్రవరం తరలివస్తూనే ఉన్నారు.
ప్రజలు, టీడీపీ అభిమానులు, ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రరానికి చేరుకునే మార్గాల్లో ఈ పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరు, రావులపాలెం, వేమగిరి వద్ద పికెట్లు ఏర్పాటు చేసి కార్లను తనిఖీలు చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఉన్న శిబిరం వద్ద నాలుగు వైపులా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే కార్లను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. చంద్రబాబు సాఫ్ట్వేర్ రంగానికి ఎనలేని సేవలు అందించారని. ఆయన ముందుచూపుతోనే తామంతా ఉద్యోగాలు సాధించామని స్థానిక ఐటీ ఉద్యోగులు వివరించారు. ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని. నిరసిస్తూ తామంతా ర్యాలీ చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఐటీ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వచ్చి మహిళలు సంఘీభావం తెలుపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నుంచి వచ్చిన మహిళలు బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా బాబుని అరెస్ట్ చేశారని ఆయన త్వరలోనే బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
TDP Agitations on CBN Arrest: బాబు అరెస్టుపై నిరసన జ్వాలలు.. విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణుల డిమాండ్
రాజమహేంద్రవరంలో నారా లోకేశ్ జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు నారా బ్రాహ్మణితో సమావేశమై సంఘీభావం తెలిపారు. తాజా పరిస్థితులపై చర్చించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని.. కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు దుర్గేష్ చిన్న రాజప్ప చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ను నాయకులు తీవ్రంగా ఖండించారు.