దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేలా.. 'ఈ-రూపీ' విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమలులో ఈ-రూపీ ఓచర్.. కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు.
"దేశంలో డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఈ-రూపీ ఓచర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ వ్యవస్థల్లోనే కాకుండా.. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఈ-రూపీ విధానాన్ని వినియోగించవచ్చు. ఈ-రూపీ ఓచర్ ప్రజలందరికీ ప్రయోజనాలను చేకూరుస్తుంది. 21వ శతాబ్దంలో.. ఆధునిక సాంకేతికత సాయంతో ప్రజలందరినీ అనుసంధానం చేస్తూ.. అభివృద్ధి పథంలో వెళ్తోందనేందుకు ఈ-రూపీ ఓ ఉదాహరణ. భారత్ 75 ఏళ్ల స్వాతంత్య వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ విధానాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పేద ప్రజలకు సాయం చేసే ఉపకరణంలా సాంకేతికత ఉపయోగపడుతోందని మోదీ అన్నారు. సాంకేతికత వల్ల పారదర్శకత సాధ్యమవుతోందని చెప్పారు. ఎల్పీజీ నుంచి రేషన్, పింఛన్ వరకు 300 పథకాల్లో ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తోందని పేర్కొన్నారు.
నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రూపీ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.
ఈ-రూపీ అంటే..
ఈ వ్యవస్థలో ఒక క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఈ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ ఓచర్ల లాంటివే. ఈ ఓచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్.. వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు.
ఇదీ చూడండి: 'మీ ఆలోచనలు.. ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి'
ఇదీ చూడండి: Modi: ట్విట్టర్లో మోదీకి మరింత పెరిగిన ఫాలోయింగ్