SCO Summit 2022 : ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులు హాజరు కానుండడమే ఇందుకు కారణం. సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో జరిగే ఈ సమావేశానికి దాదాపు 15 దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత పలు దేశాధినేతలు నేరుగా హాజరవుతోన్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే. అయితే, ఓవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ ఈ సదస్సులో ప్రధాని మోదీ హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
జూన్ 2019 తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు దేశాధినేతలు నేరుగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 14న ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌కు వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. ఇదే సమయంలో మోదీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాకిస్థాన్, చైనాల అధినేతలు సమావేశమయ్యే విషయంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.
2001లో చైనా నేతృత్వంలో ఏర్పాటైన ఎస్‌సీఓలో రష్యా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, కిర్గిజిస్థాన్ సభ్యులుగా ఉన్నాయి. 'నాటో'కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్ కూడా ఎస్‌సీఓలో చేరింది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఈ ఏడాది సదస్సు జరుగుతుండగా.. వచ్చే ఏడాది (2023 సెప్టెంబర్) సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇవీ చదవండి: పాక్‌కు అమెరికా సాయం.. భారత్ తీవ్ర అభ్యంతరం
'కశ్మీర్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..' ఆజాద్ కీలక వ్యాఖ్యలు