గుజరాత్లో భాజపా చారిత్రక విజయం, జీ20 సమవేశాలకు భారత్ నేతృత్వం వహించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. దిల్లీ అశోక రోడ్డులోని సర్దార్ పటేల్ విగ్రహం నుంచి సంసద్ మార్గ్ వరకు సుమారు కిలోమీటర్ మేర మోదీ భారీ రోడ్ షో సాగింది. ఆ మార్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. రోడ్లకు ఇరువైపుల పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. మోదీకి ఘనస్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు.
మోదీ రోడ్‌షోకు దిల్లీ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటలకు మోదీ రోడ్‌షో జరిగిన ప్రాంతానికి ఎటువంటి వాహనాలు అనుమతించమని ముందే ప్రకటించారు. రోడ్‌షోలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దిల్లీ పోలీసులు.. ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు, భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సోమవారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. కాగా, మోదీ.. రోడ్‌షో ద్వారా సమవేశ ప్రాంగణానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. గుజరాత్లో భారీ విజయం తర్వాత భాజపా నిర్వహిస్తున్న తొలి ప్రధాన సమావేశం ఇదే కావడం గమనార్హం.
అంతకుముందు సోమవారం ఉదయం.. భాజపా జాతీయ పదాధికారుల భేటీ జరిగింది. సంస్థాగత వ్యవహారాలు, పార్టీ బలోపేతంపై భాజపా పదాధికారులు చర్చించారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అక్కడ మెరుగయ్యేందుకు చేపట్టాల్సిన విషయాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భాజపాకు ఉన్న సానుకూల పరిస్థితులను ఆయా రాష్ట్రాలకు అన్వయించుకోవడంపై పదాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.