బిహార్ రాజధాని పట్నాకు చెందిన 17 ఏళ్ల నిరుపేద విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక లఫాయెట్టే కళాశాలలో ఉన్నత విద్య చదువుకోవడానికి రూ.2.5కోట్ల విలువైన స్కాలర్షిప్ను పొందాడు. ఈ మేరకు ప్రేమ్ కుమార్‌కు అంగీకార పత్రాన్ని పంపించింది కళాశాల యాజమాన్యం. "వెనుకబడిన వర్గాలకు సేవ చేయాలనే మీ నిబద్ధత, పట్టుదలను చూసి మేము ప్రేరణ పొందాము." అంటూ కళాశాల డీన్ మాథ్యూ హైడ్ అభినందన లేఖను పంపించారు.
1826లో స్థాపించిన లాఫయెట్టే అమెరికాలోని అత్యున్నత 25 కళాశాలల్లో ఒకటి. భారత దేశంలో ఇలాంటి ప్రతిష్టాత్మక కళాశాలలో సీటు సంపాందించిన మొదటి దళితుడు ప్రేమ్ కుమార్.
"నా చదువును దేశ అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను. విద్యార్థులు అందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలి. దళితుల విద్య కోసం డెక్స్టెరిటీ గ్లోబల్ ఫౌండేషన్ చాలా కృషి చేస్తోంది. వారి సహకారంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్కాలర్షిప్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. "
-ప్రేమ్ కుమార్, విద్యార్థి
పుల్వారి షరీఫ్ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతడి తండ్రి రోజూవారీ కూలీ పనులకు వెళ్తూ ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కుటుంబంలో చదువుకోవడానికి వెళ్లిన మొదటి వ్యక్తి ప్రేమే. ప్రస్తుతం అతడు శోశిత్ సమాధాన్ కేంద్రంలో 12వ తరగతి చదువుతున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్, అంతర్జాతీయ సంబంధాలపై ఉన్నత విద్య అవకాశాన్ని సంపాందించాడు. ఈ స్కాలర్‌షిప్‌తో నాలుగేళ్ల చదువుతో పాటు అక్కడ నివసించడానికి సరిపోయే డబ్బును సైతం ఇస్తారు. ప్రతిష్టాత్మక 'డైర్ ఫెలోషిప్‌కు' ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు అర్హత సాధించగా.. అందులో భారత్ తరఫున ప్రేమ్ కుమార్ ఒకరు.
డెక్స్టెరిటీ గ్లోబల్ అనేది భారత దేశంలో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థలోని విద్యార్థులు ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల నుంచి 100కోట్లకు పైగా స్కాలర్షిప్లను సంపాదించారు. బిహార్‌లోని మహాదళిత్ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల అభ్యున్నతి కోసం 2013 నుంచి ఈ సంస్థ కృషి చేస్తోంది.
ఇదీ చదవండి: ప్రియుడ్ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. అతడు చేసిన పనితో గెస్ట్‌లంతా షాక్