ఉత్తరాఖండ్.. హరిద్వార్ జిల్లాలో కదులుతున్న రైలులో ఒక్కసారిగా పొగ వ్యాపించడం కలకలం రేగింది. అది గమనించిన ప్రయాణికులు చైన్ లాగి.. రైలును నిలిపివేశారు. దీంతో రైలు వంతెనపై ఆగింది. భయందోళనకు గురైన ప్రయాణికులు.. తమ ప్రాణాలను పణంగా పెట్టి వంతెన అంచున నడిచి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు ప్రయాణికులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలోకి దూకినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
ఆదివారం లఖ్‌నవూ నుంచి చండీగఢ్ వెళ్తున్న సద్భావనా ఎక్స్‌ప్రెస్ బ్రేక్‌లు జామ్ అయి పొగ వచ్చింది. రైల్లో మంటలు అంటుకున్నట్లు భావించిన ప్రయాణికులు చైన్ లాగారు. దీంతో రైలు లక్సర్ ప్రాంతంలోని రైసీ రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే బాణ్గంగా నదిపై ఆగింది. వెంటనే ప్రయాణికుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. అదే సమయంలో బాణ్గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినా ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వంతెన అంచు నుంచి నడుచుకుని ముందుకు వెళ్లారు. కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోడానికి నదిలోకి దూకినట్లు అక్కడున్న కొందరు చెప్పారు. దీన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బ్రేకులను పునరుద్ధరించారు. అనంతరం రైలు బయలుదేరింది. ఈ ఘటనపై 'ఈటీవీ భారత్'తో మొరాదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ మాట్లాడారు. 'రైలు బ్రేక్ బ్లాక్ అయింది. లక్సర్ వద్ద చైన్ లాగడం వల్ల రైలు ఆగిపోయింది. మేము ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకున్నాము. దాన్ని మెరుగుపరచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము' అని ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
రైలు బోగీలో పొగ..
ఇలాంటి ఘటన మరొకటి ఇటీవలే జరిగింది. దిల్లీ నుంచి దర్భంగా బయలుదేరిన బిహార్ సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. థల్వారా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే.. రైలులోని ఎస్2 బోగీలో ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ఈ విషయం గమనించిన లోకో పైలెట్ .. వెంటనే అప్రమత్తమై రైలును ఆపేశాడు. పొగ వ్యాపించడం వల్ల ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి.. పట్టాలకు దూరంగా వచ్చారు. దాదాపు 15 నిమిషాలు రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది తనిఖీ నిర్వహించి.. పొగను అదుపులోకి తెచ్చారు. అనంతరం రైలు దర్భంగాకు బయలుదేరింది. ఈ ఘటనపై సమస్తీపుర్ రైల్వే డివిజన్ డీఆర్‌ఎమ్ అలోక్ అగర్వాల్ స్పందించారు. బ్రేక్ వైండింగ్ కాలిపోవడం వల్ల రైలు బోగీలో పొగలు వ్యాపించాయని తెలిపారు. బ్రేక్ షూ.. రైలు చక్రం మధ్య రాపిడి ఎక్కువ కావడం వల్ల ఇలా జరుగవచ్చని ఆయన వెల్లడించారు. ఈ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.