Arguments in Supreme Court on R5 zone : ఆర్5 జోన్ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. 2023 మార్చి 21న ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందని, మొత్తం 34 వేల ఎకరాల్లో 900 ఎకరాలు కేటాయించారని తెలిపారు. కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని, అవేవీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కాదని అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, వారి తరఫునే వాదిస్తున్నాం అని తెలిపారు. ఆర్-3 జోన్‌లో మాత్రమే భూమి తీసుకోవడానికి అవకాశం ఉందని, కావాలంటే ఈ సిటీకి మరో 900 ఎకరాలు కేటాయించుకోవచ్చు అని పేర్కొన్నారు. సిటీకి ఇచ్చిన 6500 ఎకరాల్లో 900 ఎకరాలు తీసుకోవద్దంటే ఎలా? అని అన్నారు.
రైతులకు హామీలిచ్చి భూ సేకరణ... కాగా, ఒకసారి పట్టాలిస్తే మాస్టర్‌ప్లాన్‌ను విధ్వంసం చేసినట్లే అని రైతుల తరఫు న్యాయవాది వాదించారు. పట్టాలు ఇచ్చేస్తే తిరిగి తీసుకోలేమని పేర్కొన్నారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం రైతులు భూములిచ్చారని తెలిపారు. ఒక మహానగరం వస్తుందని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశ చూపడంతో 29 గ్రామాల ప్రజలు ఆ మాటలు నమ్మారని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం మాట నమ్మి.. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు.
కోర్టు తీర్పులకు విరుద్ధం.. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధిపై ప్రచారం చేసిన అధికారులు.. నవ నగరాలు ప్రతిపాదించారని తెలిపారు. నవ నగరాల అభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని, ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రూపురేఖలు మారతాయని రైతులు ఆశించినట్లు తెలిపారు. నవ నగరాల్లోని ప్రతి నగరంలో రెసిడెన్షియల్ జోన్ ఉన్నట్లు తెలియజేస్తూ.. ఆర్థికంగా వెనకబడిన వారికి 5 శాతం భూములివ్వాలని, రెసిడెన్షియల్ జోన్ల నిబంధనల ప్రకారం కేటాయింపులుండాలని అన్నారు. ప్రభుత్వాలు మారితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టలేరని గుర్తుచేస్తూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. జులైలో తుది విచారణ జరగాల్సి ఉందని, అంతకుముందే పట్టాలిస్తే ఇక చేయడానికి ఏం ఉంటుందని రైతుల తరఫు న్యాయవాది సందేహం వ్యక్తం చేశారు.
హడావుడిగా పనులు.. కాలుష్య రహిత పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో ప్రభుత్వం ఆర్5 జోన్ అంటోందని, ఎలక్ట్రానిక్స్ సిటీలో 3 లక్షల 75 వేల ఉద్యోగాలు వస్తాయని రైతుల తరఫు న్యాయవాది విన్నవించారు. ఆ పేరు చెప్పి మాస్టర్ ప్లాన్ విధ్వంసం చేస్తామంటే అంగీకరించలేమని స్పష్టం చేశారు. 5844 అభ్యంతరాలు, గ్రామసభల తీర్మానాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లిందని, సీఆర్డీఏ ఈ అభ్యంతరాలన్నీ ఎక్కడ పరిగణనలోకి తీసుకుందని వాదనలు వినిపించారు. కోర్టుల్లో రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఇంత తొందర ఎందుకు?.. జంగిల్ క్లియరెన్స్, మిగిలిన పనులన్నీ కూడా చేపట్టారని పేర్కొన్నారు.
సీఆర్డీఏ తరఫున వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 5844 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, అలాట్‌మెంట్ పూర్తయిందని, పట్టాలు అందించలేదని చెప్పారు.
తుది తీర్పునకు లోబడే... ఆయా వాదనలు విన్న సుప్రీం.. పట్టాలిస్తే కనుక తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. హైకోర్టులో పెండింగ్ రిట్ పిటిషన్ తీర్పునకు లోబడే పట్టాలు చెల్లుబాటు అవుతాయని, పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండదని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి :