అలెక్సా.. ప్రస్తుతం ఈ పేరు తెలియనివారుండరు. ఇంట్లో కూర్చున్న దగ్గరే మనకోసం అన్ని స్మార్ట్ పనులు చేసిపెట్టే అసిస్టెంట్ ఇది. అయితే.. ఇలాంటి అసిస్టెంట్‌నే విభిన్నంగా తయారు చేశాడు ఒడిశా కటక్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ కుర్రాడు. భువనానంద ఒడిశా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన స్వాధిన్ దాస్.. వాయిస్‌తో పనిచేసే 'స్మార్ట్ మిర్రర్' తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ప్రతిభకు సాటిలేదని నిరూపించుకున్నాడు.
ఎల్ఈడీ మానిటర్, రాస్ప్బెర్రీ పీఐ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన హార్డ్‌వేర్ టెక్నాలజీతో కూడిన టూవే మిర్రర్‌ను ఉపయోగించి ఈ 'స్మార్ట్ మిర్రర్' తయారు చేశాడు స్వాధిన్. దీని కోసం దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపాడు.
ఈ అసిస్టెంట్ సాయంతో ఎలక్ట్రిక్ బల్బ్‌లు, ఫ్యాన్, ఏసీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపరేట్ చేయవచ్చు. అలెక్సా మాదిరిగానే ఇది మ్యూజిక్ వినిపిస్తుంది, న్యూస్ కూడా చదువుతుండటం విశేషం.
అయితే.. కరోనా కారణంగా దీని తయారీకి సంబంధించిన వస్తువులు సులభంగా దొరకలేదని స్వాధిన్ అన్నాడు. నాలుగు నెలలు శ్రమించి.. ఈ స్మార్ట్ మిర్రర్ తయారు చేసినట్లు వెల్లడించాడు. వృద్ధులకు, దివ్యాంగులకు.. తాను చేసిన యంత్రం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. తమ కళాశాలలో చదువుతూనే ఇలాంటి యంత్రం స్వాధిన్ తయారు చేయడంపై భువనానంద కాలేజీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:4 గుంటల స్థలంలో 265 వరి రకాలు.. ఎలా సాధ్యం?