NUPUR SHARMA Controversy: భాజపా మాజీ ప్రతినిధి నుపుర్ శర్మ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, సైనికాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సీజేఐని కోరారు. నుపుర్ శర్మ ప్రాథమిక హక్కులను కోర్టు కాపాడలేకపోయిందని లేఖలో పేర్కొన్నారు. బలవంతంగా పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్లను బదిలీ చేసే అధికారం హైకోర్టులకు ఉండవని తెలిసినా.. కింది న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఆక్షేపించారు. ఈ లేఖపై 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు, 77 మంది బ్యూరోక్రాట్లు, 25 మంది మాజీ సైనికాధికారులు సంతకాలు చేశారు.
"జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా బెంచ్ చేసిన వ్యాఖ్యలు దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. 'దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యులు' అంటూ చేసిన వ్యాఖ్యలు హేతుబద్ధంగా లేవు. న్యాయవ్యవస్థ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సరికాదు. న్యాయసహాయం కోసం నుపుర్ శర్మ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం మాత్రమే సహాయం చేయగలదని భావించారు. ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.. ఆమె పిటిషన్‌తో సంబంధం లేకుండా ఉన్నాయి. పరోక్షంగా ఆమెకు న్యాయసహాయాన్ని తిరస్కరించారు. భారత న్యాయవ్యవస్థకు ఇది మాయని మచ్చ. ప్రజాస్వామ్య విలువలపై ఇవి తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున.. దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం."
-సీజేఐకి రాసిన లేఖ సారాంశం
సుప్రీం బెంచ్ ఏమందంటే?
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నుపుర్ శర్మ. తనపై నమోదైన కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేయాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం నుపుర్ శర్మపై తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం దేశంలో జరిగిన పలు ఘటనలకు ఆమే బాధ్యురాలని న్యాయస్థానం మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ వార్త పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఖైదీలంతా విడుదల!