New Parliament Inauguration : అమృతోత్సవ వేళ ఆత్మ నిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆదివారం ఉదయం 7.15 నిమిషాలకు ప్రధాని కొత్త భవనానికి విచ్చేయనున్నారు. ఏడున్నర గంటలకు పూజ కార్యక్రమాలతో వేడుక ప్రారంభం కానుంది. దాదాపు గంటపాటు పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.
అనంతరం ఎనిమిదిన్నర గంటలకు మోదీ లోక్‌సభ ఛాంబర్‌కు చేరుకోనున్నారు. తొమ్మిది గంటలకు లోక్‌సభ స్పీకర్ పోడియం వద్ద సెంగోల్‌ను ప్రతిష్టించనున్నారు. అనంతరం తొమ్మిదన్నరకు లోక్‌సభలో ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రార్థనలు ముగిసిన తర్వాత ప్రధాని పార్లమెంటు ప్రాంగణం నుంచి బయలుదేరుతారు.
New Parliament Schedule : కొంతసేపు విరామం తర్వాత వేడుకల్లో రెండో భాగం మొదలుకానుంది. 11.30 నిమిషాలకు ప్రముఖులు, అతిథులు ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారు. 12 గంటలకు ప్రధాని వచ్చిన తర్వాత జాతీయ గీతంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 12.10 నిమిషాలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రసంగం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్‌లు సందేశాలు ఇవ్వనున్నారు.
New Parliament Building Opening : అనంతరం 12.17 నిముషాలకు పార్లమెంట్ చరిత్ర గురించి తెలిపే రెండు లఘచిత్రాలను ప్రదర్శించనున్నారు. అనంతరం 12.38 నిముషాలకు రాజ్యసభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించనున్నారు. ఒంటిగంటకు 75 రూపాయల నాణేన్ని, స్టాంపును ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడతారు. 2 గంటలకు ముగింపు వేడుక జరగనుంది.
సెంగోల్‌ను అందుకున్న మోదీ
పార్లమెంటు నూతన భవనంలోని లోక్‌సభ స్పీకర్ సమీపంలో ప్రతిష్టించనున్న సెంగోల్‌గా పిలిచే రాజదండాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుకున్నారు. ప్రధాని అధికార నివాసంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన ఆధీనం స్వాములు....ప్రధాని మోదీకి సెంగోల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వారు ఆశీస్సులు అందించారు.
ప్రతిపక్షాలు దూరం..
New Parliament Opposition : ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ భవన ఆర్కిటెక్ట్ బీమా పటేల్, నిర్మాణ సంస్థ టాటాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాను సైతం ఆహ్వానించారు. అయితే, పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు ఇటీవల సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహా 25 పార్టీలు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నట్లు తెలిపాయని కేంద్రం చెప్పింది.
కొత్త భవన ప్రత్యేకతలు ఇవే
Parliament New Building : అత్యాధునిక సదుపాయాలతో 64,500 చదరపు మీటర్ల పరిధిలో పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. పాత భవనం పక్కనే స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో 1,200 కోట్లకు పైగా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త భవంతి రూపుదిద్దుకుంది. రాజ్‌పథ్ ఆధునికీకరణ, ప్రధాన మంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి కొత్త కార్యాలయం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
నూతన పార్లమెంటు భవనానికి డిసెంబర్ 2020లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కొత్త భవనంలో 4 అంతస్తులు ఉంటాయి. దీన్ని పూర్తి చేయడానికి రెండున్నర ఏళ్లు పట్టింది. ఒకేసారి 1,274 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా దీన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి. పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేశారు.
జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి- యాజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపున నలంద చిత్రాలను నెలకొల్పారు. శక్తి ద్వారానికి ఒకవైపున చాణక్య, మరోవైపున మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలను ఏర్పాటు చేశారు. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపున సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాలు నెలకొల్పారు. భవనం లోపల ఇండియన్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన పెయింటింగ్స్, శిల్పకళలను ఉంచారు.