రాతియుగంలో ఆదిమానవుడు పచ్చి ఆహారంతో ఆకలి తీర్చుకునేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే కాలక్రమేణా ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరిగాక.. మనిషి తన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆహారాన్ని వండుకొని తినడం, ముడి పదార్థాల సాయంతో వివిధ రుచుల్లో వంటకాలు చేసుకోవడం నేర్చుకున్నాడు. అయితే యూపీలోని హర్దోయి జిల్లాకు చెందిన నాజిర్ బేగ్ మాత్రం ఇప్పటికి రాతియుగం నాటి అలవాట్లతోనే జీవిస్తున్నాడు. ప్రతిరోజు పచ్చి కూరగాయలు, మాంసం, గుడ్లు తింటూ గడిపేస్తున్నాడు. చిన్ననాటి నుంచి ఏళ్లుగా ఇదే ఆహారపు అలవాట్లను పాటిస్తున్నాడు. అందుకే అతడిని అందరూ నేటి తరం ఆదిమానవుడిగా పిలుస్తున్నారు.
రోజూ నాలుగు కిలోలు..
షాహాబాద్ మండలంలోని కాశీరామ్ కాలనీలో ఉంటున్న నాజిర్ బేగ్ ఓ దినసరి కూలీ. ప్రతిరోజు ఆహారాన్ని పచ్చిగానే తీసుకునే నాజిర్.. బంగాళదుంప, పొట్లకాయ, వంకాయ, సోయా ఆకులు, కాలీఫ్లవర్ వంటి ఏ కూరగాయలనైనా వండకుండానే ఆరగించేస్తాడు. ఇలా రోజూ దాదాపు నాలుగు కిలోల కూరగాయలు, అరకేజీ మాంసాన్ని సునాయసంగా తినేస్తాడు. చిన్ననాటి నుంచి పచ్చివాటినే తింటున్నానని.. తనకు వండిన కూరగాయలు, వంటలు అస్సలు ఇష్టం ఉండదని నాజిర్ చెబుతున్నాడు.
అలా అలవాటు...
పదేళ్ల వయసులో నాజిర్ను తన కుటుంబసభ్యులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అలా రోడ్డున పడ్డ నాజిర్కు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఓ పొలంలో పనికి కుదిరాడు. మేకలకు ఆహారం పెట్టడం, కలప సేకరించడం వంటి పనులు చేసేవాడు. అయితే పని చేసి బాగా ఆకలితో ఉండే నాజిర్.. చుట్టు పక్కల పొలాల నుంచి కూరగాయలను దొంగచాటుగా తెచ్చుకొని తినడం ప్రారంభించాడు. అంతేకాకుండా మాంసం దుకాణాల వద్ద పక్కన పడేసిన మాంసం తెచ్చుకొని కడుపునింపుకొనేవాడు. అదే అలవాటుగా చేసుకున్న నాజిర్ బేగ్.. అప్పటి నుంచి ఇప్పటివరకు తాను వండిన పదార్థాలను తినలేదని, పచ్చి ఆహారంతోనే జీవనం సాగిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
వైద్యులు ఏమంటున్నారంటే...
సాధారణంగా ప్రజలు మాంసం, గుడ్లు, కూరగాయలను ఉడికించి తింటారు. ఇందుకు కారణం అవి సులభంగా జీర్ణం అవుతాయని. కాని నాజిర్ పచ్చి ఆహారాన్ని జీవితంలో భాగం చేసుకోవడంపై హార్దోయి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పచ్చికూరగాయలు తిన్నా ఏం కాదని.. చాలా మంది క్యారెట్, కీరదోస, టమోటా వంటి కూరగాయలను ఇలాగే తింటుంటారని చెప్పారు. అయితే మాంసం, గుడ్లు వంటి ఆహారపదార్థాలను మాత్రం పచ్చివి తినడం మంచిదికాదని అంటున్నారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా వ్యాధుల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అయితే నాజిర్ను మాత్రం నేటి తరం రాతిమానవుడిగా అభివర్ణించారు.