Mother Son Train Death: నడుస్తున్న రైలులోంచి ప్రమాదవశాత్తు పడి తల్లి, ఆమె ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించి పంచనామాకు తరలించారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగింది.
జరిగింది ఇదే..
మహారాష్ట్ర, నాగ్‌పుర్‌లోని టెకానకా ప్రాంతానికి చెందిన ఇషాంత్ రామ్‌టెకె, పూజ దంపతులు. ఇషాంత్.. మధ్యప్రదేశ్, రేవాలోని మిలిటరీ కాలేజీలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. వారికి ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. కుటుంబం మొత్తం నాగ్‌పుర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని రేవాకు రైలులో ఆదివారం బయల్దేరారు.
రైలు భండారా జిల్లాలోని దేవదా- మడ్గీ వెయిన్‌గంగా నది బ్రిడ్జ్ వద్దకు రాగానే.. చిన్నారి అథర్వను టాయిలెట్‌కు తీసుకెళ్లింది పూజ.
పూజ, అథర్వ ఎంతసేపటికీ రాకపోగా.. రైలు మొత్తం గాలించి, సమీపంలో ఉన్న ఘోండియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు ఇషాంత్. రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు.
బ్రిడ్జ్‌పై వేలాడుతూ ఉన్న పూజ మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి అథర్వ మృతదేహాన్ని వంతెన కింద గుర్తించారు. అథర్వ పరిగెడుతూ రైలు నుంచి పడిపోయి ఉంటాడని, అతడిని కాపాడే ప్రయత్నంలో పూజ కూడా రైలు నుంచి పడిపోయి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. ఇద్దరి మృతదేహాలను పంచనామాకు తరలించి.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: మోదీకి నల్లజెండా చూపించిన మహిళపై దుండగుల కాల్పులు