జమ్ముకశ్మీర్‌లో సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ సొరంగ మార్గాన్ని గుర్తించింది. ఈ టన్నెల్ 150 మీటర్ల పొడవున్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ సింగ్ వెల్లడించారు. నవంబర్ 19న నగ్రోటా ఎన్కౌంటర్లో హతమైన నలుగురు జైషే మహ్మద్ ముష్కరులు.. దీని ద్వారానే దేశంలోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు.
![Massive anti-tunnelling operation on along IB in JK's Samba](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9627170_1.jpg)
శుక్రవారం నుంచి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆపరేషన్ సాగింది. ఇతర భద్రతా దళాలు, పోలీసులు కూడా వీరికి సహకరించారు.
![Massive anti-tunnelling operation on along IB in JK's Samba](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9627170_2.jpg)
ఫుల్ బాడీ ట్రక్ స్కానర్లు కావాలి..
నగ్రోటా ఎన్కౌంటర్ పరిణామాల అనంతరం.. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఫుల్ బాడీ ట్రక్ స్కానర్లు కావాలని కోరుతున్నాయి భద్రతా దళాలు. ముష్కరులు ఎక్కువగా ట్రక్కుల్లో దాక్కొనే.. కశ్మీర్ గుండా రాష్ట్రాలు దాటుతున్న నేపథ్యంలో వేర్వేరు చెక్‌పోస్టుల వద్ద వీటిని అమర్చాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నారు అధికారులు.
ఇదీ చూడండి: హద్దు మీరిన పాక్- బుద్ధి చెప్పిన భారత్
బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో నవంబర్ 19న భద్రతాదళాలు నిర‌్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. వారి వద్ద 11 ఏకే అసాల్ట్ రైఫిళ్లు, 3 పిస్టోళ్లు, 29 గ్రెనేడ్లు సహా భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 28న జమ్ముకశ్మీర్‌లో 8 విడతల్లో జరగనున్న స్థానిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'నగ్రోటా ఉగ్రదాడి.. ఆ సంస్థ ప్రణాళిక ప్రకారమే'