లఖింపుర్ ఖేరి ఘటనపై చేపట్టిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. లఖింపుర్ ఘటనలో మరణించిన లవ్ ప్రీత్ సింగ్ తల్లికి వెంటనే ఉన్నతస్థాయి వైద్యం అందించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని యూపీ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమాప్రసాద్‌ను ఆదేశించింది.
లఖింపుర్ ఘటనపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు రాసిన లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఘటనకు కారకులైన అందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, శిక్షించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది శివకుమార్ త్రిపాఠి విజ్ఞప్తి చేశారు.
అనంతరం వాదనలు వినిపించిన యూపీ అదనపు అడ్వకేట్ జనరల్.. ఘటన చాలా దురదృష్టకరమైనది, కేసు విచారణకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. లఖింపుర్ ఘటనలో అసలు నిందితులు ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేశారు? ఎవరిని అరెస్టు చేశారు? అనే వివరాలతో.. స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: యడియూరప్ప సన్నిహితుడి ఇంట్లో ఐటీ సోదాలు