కేరళకు చెందిన ఓ మహిళ వినూత్న సాహస యాత్ర చేపట్టారు. ఫిఫా వరల్డ్ కప్‌ను చూసేందుకు కన్నూర్ నుంచి ఖతర్‌కు మహేంద్ర జీపుపై ఒంటరిగా బయలుదేరారు. ఆమె పేరే నాజీ నౌషీ. ఆమెకు ఐదుగురు సంతానం. నౌషీ గృహిణీ అయినప్పటికీ యూట్యూబర్, యాత్రికురాలుగా నెటిజన్లకు పరిచయం.
ఫుట్‌బాల్ అంటే నౌషీకి అసక్తి ఎక్కువ. ఆమె యూట్యూబ్‌లో వీడియోలు చేయడం, సాహస యాత్రలు, వ్లాగ్‌లు కూడా చేస్తారు. ఈ క్రమంలో ఆమె కన్నూర్ నుంచి ఖతర్‌కు మహేంద్ర జీపుపై సాకర్‌ను చూసేందుకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాష్ట్ర రవాణా మంత్రి ఆంటోనీ రాజు ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నాజీ నౌషీ ఎప్పుడూ సాహోసోపేతమైన ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ఈ ప్రయాణంలో ఆమె కోయంబత్తూర్ మీదుగా ముంబయి చేరుకున్న తర్వాత ఓడలో జీపుతో సహా ఒమన్ వెళ్తారు. అక్కడి నుంచి ఫిఫా వరల్డ్ కప్‌నకు ఆమె ఆతిథ్యమిచ్చే ఖతర్‌కు చేరుకోవడానికి యూఏఈ, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాను దాటనున్నారు.
'కేరళకు చెందిన ఒక మహిళ ఇలాంటి యాత్ర చేపట్టడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 10 నాటికి ఖతర్‌కు చేరుకుని సాకర్ ఫైనల్ చూడాలనేది నా కోరిక. ఈ పర్యటన గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. నేను అర్జెంటీనా టీమ్‌కు అభిమానిని. నా అభిమాన ఆటగాడు మెస్సీ'. అని చెప్పారు నౌషీ.
డిసెంబర్ 31 వరకు నౌషీ.. ఖతర్‌లోనే బస చేయనున్నారు. ప్రయాణంలో అవసరమైన వంట వస్తువులు, వసతికి సంబంధించిన సామాన్లు జీపులోనే ఏర్పాటు చేసుకున్నారు. ప్రయాణ సమయంలో రాత్రి వేళల్లో టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకుల వద్ద బస చేస్తానని నౌషీ తెలిపారు. తనకు ఒమన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని వెల్లడించారు. భారత్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడడం చూడాలని కలలు కంటున్నానని ఆమె చెప్పారు.
ప్లస్ టూ వరకు చదివిన నౌషీ.. నౌషాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 19 ఏళ్లకే ఆమె తల్లి అయ్యారు. తన భర్త, పిల్లలు తనను ప్రోత్సహిస్తారని తెలిపారు. నౌషీ లద్దాఖ్ పర్యటన కూడా చేశారు. ఆమె తన సోషల్ మీడియా పేజీలో ఆ పర్యటన వీడియోలను, ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నౌషీ చిన్న బిడ్డ వయసు రెండేళ్లు మాత్రమే. నౌషీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆమె తల్లి పిల్లల బాధ్యత తీసుకుంటోంది. తన పర్యటన మరింత మంది మహిళలకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటోంది నౌషీ.
ఇవీ చదవండి: యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు