దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7దశాబ్దాలు దాటినా.. కర్ణాటక హోసకులి గ్రామస్థులు ఇప్పటికీ కనీస సదుపాయాలు లేక ఇబ్బందిపడుతున్నారు. రోజు నీటిగండాన్ని దాటుకుంటూ బతుకులు వెల్లదీస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా(Karnataka uttara kannada news) హొన్నావర్ తాలూకాలోని హోసకులిగ్రామం.... నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. దాదాపు 60 కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తున్నాయి. హొన్నావర పట్టణానికి కేవలం 8కి.మీ. దూరంలో ఉన్న హోసకులి గ్రామానికి ఇప్పటివరకు రోడ్డుమార్గం(Village without roads) లేదు. దీంతో గ్రామస్థులంతా సమీపంలోని కాల్వ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో నది ఉప్పొంగి, కాల్వలో ప్రవాహం పెరిగితే రాకపోకలు నిలిచిపోతాయి. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
అష్టకష్టాలు పడుతూ..
వాగులో ప్రవాహం పెరిగినప్పుడు విద్యార్థులు, గర్భిణులు, వృద్ధులను వాగు దాటించడం సవాలుగా మారుతోంది. పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు.. అష్టకష్టాలు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ప్రయాసపడినా.. సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లటం.. సవాలుగా మారుతోందని హోసకులి గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
చేతులపై మోస్తూ..
ఇతరుల సాయంతో చేతులపై మోస్తూ.. వాగు దాటి వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. నీటి ఉద్ధృతి పెరిగితే వాగు దాటలేక ప్రాణాలు కోల్పోవాల్సిందేనని వాపోతున్నారు. ఇప్పటివరకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము పడుతున్న బాధలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని హోసకులి ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: