బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఆమె మాటలు వింటే అది నిజమే అనిపిస్తోంది. అవకాశం వస్తే.. ప్రజాసేవకు సిద్ధమేనంటూ తన రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తాజాగా ఓ చర్చావేదికపై మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
'అవకాశం వస్తే ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నాను. నా సొంత రాష్ట్ర ప్రజల(హిమాచల్‌ప్రదేశ్)కు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తాను. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత భారత్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి భారతీయుడిలో జాతీయభావం కనిపిస్తోంది. సామాన్య ప్రజల గురించి మాట్లాడుతున్నందున ప్రతి భారతీయుడికి ఆయనతో దగ్గరి బంధం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నేను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చాను. మోదీ పనితీరుతో ఇప్పుడు మా కుటుంబం భాజపా పక్షాన నిలిచింది' అని కంగనా అన్నారు.
'నేను సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్‌ప్రదేశ్ మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, భాజపా కోరుకుంటే.. మండీ ప్రాంతం నుంచి పోటీ చేయడానికి సిద్ధమే. కానీ దేశంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వారు రాజకీయాల్లోకి రావాల్సి ఉంది' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. మోదీకి పోటీదారు కాదని, హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు: మోదీ