1,700 అడుగుల ఎత్తైన కొండను చేతులతో పాకుతూ ఎక్కి ఔరా అనిపించాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ఈ సాహసాన్ని కేవలం 2 గంటల్లోనే పూర్తిచేశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రఖ్యాత నరసింహ గద కొండను కేవలం చేతుల సహాయంతోనే ఎక్కి.. కన్నడ జెండాను ఎగురవేశాడు జ్యోతిరాజ్ అనే వ్యక్తి. ఆదివారం ఉదయం దుర్గాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి.. ఈ సాహసాన్ని మొదలుపెట్టాడు జ్యోతిరాజ్. ఇందుకోసం అటవీ శాఖ అధికారుల అనుమతిని తీసుకున్నాడు. రక్షణగా నడుము చుట్టూ తాడును కట్టుకుని ఈ సాహసాన్ని పూర్తి చేశాడు. ఉదయం 9:50 గంటలకు ఎక్కడాన్ని ప్రారంభించిన జ్యోతిరాజ్.. మధ్యలో 20 నిమిషాల విరామం తీసుకున్నాడు. అనంతరం తిరిగి ప్రారంభించిన జ్యోతిరాజ్.. కొండపైకి ఎక్కి జెండాను ఎగురవేశాడు. సాహసాన్ని పూర్తి చేసిన జ్యోతిరాజ్ను అనేకమంది అభినందిచారు.
కర్ణాటక కోతిరాజ్గా గుర్తింపు
ఇప్పటికే అనేక సాహసాలు చేసిన జ్యోతిరాజ్ను.. కర్ణాటక కోతిరాజ్గా పిలుస్తారు. ఎంతో ఎత్తైన గోడలను సెకన్లలోనే ఎక్కుతాడు. చిత్రదుర్గ్లోని ఎత్తైన కోటను కూడా ఎక్కాడు. గతేడాది 405 అడుగుల జాతీయ జెండా స్తంభాన్ని ఎక్కి ఘనత సాధించాడు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఈ సాహసాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నాడు జ్యోతిరాజ్. రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అనేక విన్యాసాలు చేశాడు. తన సొంత డబ్బులతో 15 మంది యువతకు కూడా కొండలు ఎక్కడంలో శిక్షణ ఇస్తున్నాడు జ్యోతిరాజ్.
ఇవీ చదవండి: 12 సెకన్లలో రూ.1.25 లక్షలు విలువైన బంగారు గొలుసు చోరీ
అనేక రోజులుగా ఇంట్లోనే తల్లి మృతదేహం.. బతికుందని అందరినీ నమ్మిస్తూ..