ఝార్ఖండ్ అసెంబ్లీ సెప్టెంబర్ 5న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్వాస పరీక్ష పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగటంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో జేఎంఎం ప్రతినిధి బృందం.. గవర్నర్ రమేష్ బైస్‌ను కలిసింది. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడనుందని రాజ్‌భవన్ నుంచి లీక్‌లు రావటం వల్ల పాలనా యంత్రాంగంలో అనిశ్చితి, గందరగోళం నెలకొన్నట్లు అధికార యూపీఏ ప్రతినిధి బృందం గవర్నర్‌కు సమర్పించిన లేఖలో తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హేమంత్ సర్కార్‌ను అక్రమ పద్ధతిలో అస్థిరపరిచే చర్యలను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. హేమంత్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటువేసినా కూటమికి తగినంత మెజార్టీ ఉందని, ఆ ప్రభావం ప్రభుత్వంపై ఉండదని స్పష్టంచేసింది.
ఎన్నికల కమిషన్ నుంచి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే వెల్లడించాలని గవర్నర్‌ను కోరింది. అనంతరం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధూ టిర్కీ.. రాజ్‌భవన్ నుంచి లీక్‌లు వచ్చాయన్న ఆరోపణలను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలిపారు. సోరెన్ శాసనసభ్యత్వానికి సంబంధించి 2 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. సీఎం సోరెన్ రాజీనామా చేయటం లేదని బంధూటిర్కీ తెలిపారు.
సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష భాజపా.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్ రమేశ్ బైస్.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. అందుకు అనుగుణంగా ఈసీ తన అభిప్రాయాన్ని ఆగస్టు 25న సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్లు తెలిసింది.
హేమంత్పై అనర్హత వేటు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఝార్ఖండ్ రాజకీయాల్లో కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఊగిసలాటలో పడింది. శాసనసభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తే ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్ ముందస్తు వ్యూహాలు అమలు చేశారు. ప్రత్యర్థుల బేరసారాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఛత్తీస్‌గఢ్ తరలించారు. 81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
హేమంత్ సోరెన్ ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: దేశంలో ఎక్కడున్నా ఆ బడిలో చేరొచ్చు.. తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం
ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..