Janasena Party Meeting Pawan Kalyan: మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలు చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణతో పాటు టీడీపీతో పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
స్పష్టమైన అవగాహన ఉంది: తాను ఏం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని, కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే తమ పార్టీకి దిల్లీలోనూ గుర్తింపు వచ్చిందని పవన్ అన్నారు. భావజాలం ఏమీ లేని పార్టీ వైసీపీ అన్న పవన్, సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు.
నాపై సందేహం ఎందుకు? : కష్టకాలంలో అండగా నిలిచిన అందరినీ గుర్తుపెట్టుకుంటానని పవన్ తెలిపారు. అందరికీ మేలు చేసే నిర్ణయం తీసుకుంటానని నమ్మితే చాలని అన్నారు. మోదీకి, నడ్డాకు అర్థమైనా మీకెందుకు నాపై సందేహమని పవన్ ప్రశ్నించారు. టీడీపీ-జనసేన వ్యతిరేకులను వైసీపీ వ్యక్తులుగా భావిస్తానని, జగన్‌ను కనీసం 10 ఏళ్లపాటు రాజకీయాల వైపు చూడకుండా చేయాలని పేర్కొన్నారు. రాబోయే వంద రోజుల్లో ప్రతిరోజు జగన్‌కు అరశాతం ఓట్లు తగ్గాలని, నారా లోకేశ్ యువగళంలో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యువత ఆదరణ చూసే తెలంగాణలో పోటీ: తెలంగాణ నగరప్రాంతాల్లో ఓటింగ్‌కు యువత దూరంగా ఉన్నారని జనసేనకు యువతే పెద్ద బలమని పవన్ అన్నారు. తమ పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని, ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని తెలిపారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదని, పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. తనను, తన భావజాలాన్ని నమ్మే యువత తమ వెంట వస్తున్నారని, యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని చెప్పారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో రౌడీలను ఎదుర్కొంటున్నా : పవన్ కల్యాణ్
కష్టాల్లో ఉన్నా సాయం కోరలేదు: తాను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదని, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అనుకున్నానని స్పష్టం చేశారు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నానని పవన్ అన్నారు. చేసే పని, పోరాటమే గుర్తింపు ఇస్తుందని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నాం, సాయం చేయాలని దిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదని, సినిమాలు ఆపేసినా, హోటల్‌కు వచ్చి బెదిరించినా సాయం కోసం ఎవరినీ కలవలేదని అన్నారు.
కులం మీద రాజకీయాలు నడపలేం: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేశాయని, వైసీపీను తట్టుకునేందుకే కలిసి పనిచేస్తున్నామని వాళ్లు చెప్తున్నారని పేర్కొన్నారు. మెగాస్టార్, సూపర్‌స్టార్‌ను సైతం వైసీపీ వాళ్లు బెదిరిస్తారని.. అవమానం జరిగినా, దెబ్బపడినా తాను మరిచిపోనని మండిపడ్డారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఏం కావాలో ఎవరూ గట్టిగా అడగలేదని అన్నారు. రాష్ట్రానికి ఏం ఇస్తే లాభమో ఏ నేతలూ ఆలోచించలేదని విమర్శించారు. ఒక కులం మీద రాజకీయాలు నడపలేమని, అది సాధ్యం కాదని చెప్పారు.
ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని చెప్పా: వైసీపీ నేతలు వేసే కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని కోరుతున్నానని తాను ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పానని పవన్ తెలిపారు. తమకు ప్రజలు ముఖ్యం కానీ నాయకులు కాదన్న పవన్ అన్నారు. తలదించుకునే పరిస్థితిలో ఎప్పుడూ ఏపీ ఉండకూడదని పేర్కొన్నారు.
ప్రాణం పోయేవరకు నిలబడతా: ఏపీ ప్రజలు ఎప్పుడూ తలెత్తుకునే పరిస్థితులు ఉండాలని పేర్కొన్న పవన్ తప్పనిసరి పరిస్థితుల్లోనే 2014లో టీడీపీకి మద్దతిచ్చామని తెలిపారు. ఆ రోజుల్లో పార్టీని నడపలేకపోయామని, నిలబడలేకపోయామని వెల్లడించారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రాణం పోయేవరకు నిలబడతానని భరోసా ఇచ్చారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే వీరంతా ఏం చేస్తారు: జగన్ మహానుభావుడు కాదని ప్రజా కంటకుడు అని మండిపడ్డారు. జనసేన పార్టీ నుంచి వెళ్లిపోయినవారు తిట్టినా పట్టించుకోనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే వీరంతా ఏం చేస్తారని ప్రశ్నించారు. తమను విమర్శించేవారు ఈ విషయం గుర్తుంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది : పవన్ కల్యాణ్
టీడీపీతో కలిసి నడుస్తున్నాం: డబ్బు లేకున్నా పట్టుదలగా పదేళ్లపాటు పార్టీని నడిపామని తాము టీడీపీ వెనుక నడవడం లేదని, కలిసి నడుస్తున్నామని పేర్కొన్నారు. షణ్ముఖ వ్యూహంలో చెప్పినవన్నీ అమలుచేయబోతున్నామని, ఏ మతం వారినైనా సనాతన ధర్మం స్వీకరిస్తుందని, కలుపుకుంటుందని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తే ఎవరినైనా గౌరవిస్తామన్నారు.
ప్రభుత్వం వచ్చాక అనేక అవకాశాలు ఉంటాయి: ఎన్ని మాట్లాడుకున్నా సరే పోలింగ్ రోజు అనేది చాలా కీలకమని, ఆ రోజు ప్రజలను ఓటు వేసేలా చూడటం ప్రధానమని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక పార్టీ నేతలకు అనేక అవకాశాలు ఉంటాయని పవన్ తెలిపారు. ఎన్నికల్లో జీరో బడ్జెట్ అని నేనెప్పుడూ అనలేదని, ఖర్చులు ఉంటాయని ఈసీయే చెబుతోందని వ్యాఖ్యానించారు. సుస్థిరత, సంపద, సమైక్యత సాధించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.
ఉమ్మడి ఎజెండాతో ప్రజల్లోకి - 9న టీడీపీ, జనసేన సంయుక్త సమావేశం