Pawan kalyan React on Govt orders about Volunteers : ఏపీ ప్రభుత్వం వాలంటీర్లతో 23 అంశాల సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సమాచార సేకరణపై ప్రభుత్వ విధివిధానాలు ఏమిటని ప్రశ్నించిన పవన్.. వాలంటీర్లతో చేయకూడని పని చేయిస్తున్నారని తెలిపారు. సమాచార సేకరణ చౌర్యం కిందకు వస్తుందని, వాలంటీర్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. దిల్లీలో సమావేశం సందర్భంగా.. ఏపీలో సమాచార సేకరణ, వాలంటీర్ వ్యవస్థపై అమిత్‌షాతో మాట్లాడానని వెల్లడించారు.
వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ ఆ పార్టీకి రాజీనామా చేసి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేరికలు జరగగా.. జనసేనలో రమేశ్‌కు సముచిత స్థానం కల్పిస్తామని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. వాలంటీర్లను ఉద్దేశించి.. మీరు చేసే పనులను కోర్టులు కూడా చూస్తున్నాయన్న పవన్.. వాలంటీర్ల వ్యవస్థ గురించి తాను స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. వాలంటీర్లకు రోజుకు రూ.164 చొప్పున.. ఉపాధి హామీ పథకం కంటే చాలా తక్కువగా చెల్లిస్తున్నారని తెలిపారు. డిగ్రీ చదివిన వారికి చాలా తక్కువగా చెల్లిస్తున్నారని అన్నారు.
వ్యక్తిగత సమాచారం భద్రపరుచుకోవడం చాలా కీలకం అని చెప్పిన పవన్.. ప్రజలకు సంబంధించి 23 అంశాల సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారు.. సమాచార సేకరణపై ప్రభుత్వ విధివిధానాలు ఏమిటి? అని ప్రశ్నించారు. వాలంటీర్లతో చేయకూడని పని చేయిస్తున్నారని, వారంతా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఏపీ నుంచి సేకరించిన సమాచారం 3 కంపెనీలకు వెళ్తోంది.. సమాచార సేకరణ చౌర్యం కిందకు వస్తుంది... దీనిపై విచారణ జరగాలి అని అన్నారు. సమాచారం సర్వర్‌లో పెట్టుకున్నా నేరం కిందకు వస్తుందని పవన్ స్పష్టం చేశారు. సమాచార సేకరణపై అమిత్‌షాతో మాట్లాడానని ఈ సందర్భంగా తెలిపారు.
రెడ్‌క్రాస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా పని చేస్తారన్న పవన్.. రెడ్‌క్రాస్ వాలంటీర్లకు కేంద్రంలో రాష్ట్రపతి అధ్యక్షుడిగా, రాష్ట్రస్థాయిలో గవర్నర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. మరి రాష్ట్రంలో వాలంటీర్లకు నాయకుడు, అధిపతి ఎవరు?.. బాలికపై వాలంటీర్ అత్యాచారం చేస్తే బాధ్యత ఎవరిది?.. సీఎం బాధ్యత వహించాలా? మంత్రులా? ఎమ్మెల్యేలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇచ్చే హక్కు లేదని, వాలంటీర్ల విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంటే నా ప్రాణాలకు తెగించి పోరాడుతా అని పవన్ కుండబద్దలు కొట్టారు. మైనింగ్ దోపిడీ మొదలుకుని అన్నీ బయటకు తీస్తానని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎక్కడైనా విచారించండి... నేను సిద్ధం అని సవాల్ చేశారు. కేసులకు భయపడే వ్యక్తినైతే పార్టీ ఎందుకు పెడతా అని పవన్ స్పష్టం చేశారు.