నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్‌ప్యాడ్స్ వద్ద ఉగ్రకార్యకలాపాలు తగ్గలేదని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అదనపు డైరక్టర్ జనరల్ సురిందర్ పవార్ తెలిపారు. అయితే బలగాలు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
నవంబర్‌లో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఎల్ఓసీ వెంబడి ఉన్న లాంచ్ప్యాడ్ల వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అయితే 2019లో 140 మంది ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే ఈ ఏడాది 25-30 మంది ప్రయత్నించారు.
- సురిందర్ పవార్, బీఎస్ఎఫ్ ఏడీజీ
ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్లో ఈ నెల 7న అర్ధరాత్రి వేళల్లో ఉగ్రవాదులు.. భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులపై సురిందర్ స్పందించారు. ఉగ్రవాదుల చొరబాటును దీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో కెప్టెన్ అశుతోశ్ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మొత్తం ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ప్రస్తుతం మాచిల్ సెక్టార్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సురిందర్ వెల్లడించారు.