ETV Bharat / bharat

రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ! - ఐఆర్​సీటీసీ ఫుడ్ మెనూ

రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకునేందుకు ఐఆర్​సీటీసీకి అనుమతులు జారీ చేసింది.

irctc-allowed-to-customise-menu-
irctc-allowed-to-customise-menu-
author img

By

Published : Nov 15, 2022, 4:30 PM IST

రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటు ఐఆర్​సీటీసీకి కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్లలో కేటరింగ్ సేవలు మెరుగుపర్చడం సహా, ప్రయాణికులకు భిన్నరకాల వంటకాలను అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ప్రాంతీయ వంటకాలు, సీజనల్ ఆహార పదార్థాలు మెనూలో చేర్చుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. చిరుధాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులను మెనూలో భాగం చేసుకోవచ్చని సూచించింది. పండగల వేళ ప్రత్యేక ఆహార పదార్థాలు సైతం విక్రయించవచ్చని పేర్కొంది. శిశువులకు ఉపయోగపడే ఆహారంతో పాటు వివిధ వయసుల వారి అభిరుచులకు తగ్గ ఆహారాన్ని అందించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది.

ప్రస్తుతం రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే ఐఆర్​సీటీసీ కొనసాగిస్తోంది. రైల్వే బోర్డు ముందస్తు ఆమోదంతోనే ఈ మెనూలో ఆహార పదార్థాలను చేరుస్తుంటుంది ఐఆర్​సీటీసీ. ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్​సీటీసీ నిర్ణయిస్తుందని తాజా నోట్​లో రైల్వే బోర్డు వివరించింది. భోజనంలో భాగంగా కాకుండా.. ప్రత్యేకంగా ఆర్డర్ చేసే ఆహారాలు, బ్రాండెడ్ పదార్థాలను ప్రీపెయిడ్ రైళ్లలో ఎంఆర్​పీ ధరకు విక్రయించేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. మెయిల్/ ఎక్స్​ప్రెస్ రైళ్ల మెనూలో ఉండే బడ్జెట్ ఆహార పదార్థాల ధరలను సైతం ఐఆర్​సీటీసీ నిర్ణయిస్తుందని తెలిపింది. జనతా రైళ్లలో మెనూ, ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.