బాలీవుడ్ చిత్రం 'స్పెషల్26'(తెలుగు, తమిళంలో సూర్య నటించిన గ్యాంగ్)లోలాగా సీబీఐ అధికారులమంటూ ఓ వైద్యుడి ఇంటికెళ్లి రూ.36లక్షల నగదు, విలువైన నగల్ని దోచుకెళ్లారు కొందరు దుండగులు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. ఈ కేసులో బిట్టు, సురేందర్, విభ అనే వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
"శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి కార్లో డ్రైవర్ పాటు నా తండ్రితో ఇంటికి వచ్చాను. అప్పుడు ఓ ఐదుగురు మా ఇంట్లోకి చొరబడ్డారు. తాము సీబీఐ అధికారులమని చెప్పి మా సెల్ఫోన్లు గుంజుకున్నారు. నల్లధనం ఉందా అంటూ ఇల్లంతా వెతికారు. రూ. 36లక్షల నగదు, రూ.5లక్షలు విలువచేసే నగలు, 3,852 డాలర్లు, 400 పౌండ్లు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఇంకా వెతకాలి.. మౌర్య ఎన్‌క్లేవ్‌లో ఉన్న క్లినిక్‌కు వెళ్లాని నా డ్రైవర్‌తో కార్లో బయలుదేరారు.
-ప్రియాంక్ అగర్వాల్, వైద్యుడు
అయితే మౌర్య ఎన్క్లేవ్ సమీపంలోని పోలీసు స్టేషన్ దగ్గరలోకి వెళ్లగానే కారు డ్రైవర్ హారన్ మోగించాడు. దాంతో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు పోలీసులు.
నిందితుల్ని ప్రశ్నించగా.. తాము స్పెషల్26 అనే సినిమాను చూసి అందులోలాగే దొంగతనం చేశామని ఒప్పకున్నట్లు డీసీపీ ఉషా రంగ్నానీ వెల్లడించారు. నిందితులు దోచుకెళ్లిన నగదును, నగల్ని డాక్టర్ అగర్వాల్‌కు ఇచ్చారు. మిగతా నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పాముల విషం కోసం భారీ డీల్- ఐదుగురు అరెస్టు