ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. తీవ్రగాయాలతో ఖుషీనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తిని.. ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రక్తస్రావం అవుతున్న బాధితుడిని ఆస్పత్రి నేలపైనే పడుకోబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలోకి ఓ శునకం వచ్చి రక్తాన్ని నాకుతుండటం వీడియోలో కనిపిస్తోంది.
బాధితుడు ఓ ప్రమాదంలో గాయపడ్డట్లు తెలుస్తోంది. అతడిని స్థానికులు ఖుషీ నగర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆ వ్యక్తిని అత్యవసర వార్డుకు తీసుకెళ్లగా.. ఆ సమయంలో అక్కడ ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో అతన్ని నేలపైనే పడుకోబెట్టాల్సి వచ్చింది. ఎంత సేపు చూసినప్పటికీ ఒక్క వైద్యుడు కూడా అక్కడికి రాలేదు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో ఉండాల్సి వచ్చింది. ఇంతలో నేలపైన కారుతున్న రక్తాన్ని నాకేందుకు ఓ కుక్క పిల్ల అటువైపు వచ్చింది. కదలలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుడు.. అలాగే ఉండిపోయాడు. బాధితులకు మెరుగైన వైద్యం చేయడం అటుంచితే.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: మద్యం మత్తులో గ్యాంగ్ వార్.. తెగిపడిన చేతిని ఎత్తుకెళ్లిన వీధికుక్క