First IVF Calf of Punganur: ప్రపంచవ్యాప్తంగా పొట్టిగా ఉండే పశువుల జాతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూర్ జాతి ఒకటి. ఇవి నానాటికీ అంతరించిపోతున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 500 కంటే తక్కువ ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే పుంగనూర్ జాతికి చెందిన ఓ లేగ దూడ కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించింది. దేశంలో ఈ సాంకేతికతను ఉపయోగించి పురుడు పోసుకున్న తొలి పుంగనూర్ ఆవు దూడ ఇదే అని మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది.
ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర పాడిపరిశ్రమల శాఖ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు ఉమ్మడిగా చేపట్టాయి. దేశీయంగా అంతరించిపోతున్న పశువులను సంరక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాయి.
దేశీయ జాతుల ఆవు పాలల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆ పాలు వ్యాధుల నుంచి పోరాడే శక్తిని అధికంగా కలిగి ఉంటాయని అన్నారు. అయితే వేర్వేరు కారణాల రీత్యా కొన్ని దశాబ్దాలుగా దేశీయ పశుసంపద తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అరుదైన గోవులను రక్షించేందుకు పశుసంవర్ధక శాఖ కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) పద్ధతిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. పుంగనూర్ జాతి ఆవులనే మాత్రమేగాక.. బన్ని, తార్పాకర్, ఒంగోలు లాంటి మేలిమి జాతులను ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
గతేడాది అక్టోబర్‌లో గుజరాత్ సోమనాథ్ జిల్లాలో బన్ని బ్రీడ్‌కు చెందిన గేదె ఐవీఎఫ్ పద్ధతిన మగ లేగదూడ జన్మించింది. రాజస్థాన్‌లోని సూరత్‌ఘర్‌లో ఇదే సాంకేతికతతో తార్పాకర్ జాతికి చెందిన మొదటి దూడను ప్రసవించేలా చేశారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు జన్యుపరంగా మేలిమి గేదెల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని అన్నారు.
బన్ని జాతి గేదె దాని స్థితిస్థాపకత, శుష్క వాతావరణంలో అధిక పాల ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అందుకే పాల ఉత్పత్తి వృద్ధికి జన్యుపరంగా అత్యంత మేలు రకమైన ఈ గేదెల సంఖ్యను పెంచడం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ బన్ని బ్రీడ్ గేదె గిర్సోమ్నాథ్లోని ధనేజ్ గ్రామానికి చెందిన పాడి రైతు దగ్గర ఉంది.
ఇదీ చూడండి: 'లక్కీ' గొర్రె పిల్ల వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు!