INDIAN NAVY AGNIVEER RECRUITMENT 2023 : భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ 1,365 అగ్నివీర్ (SSR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మహిళలకు 273 పోస్టులను రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
4 సంవత్సరాలు మాత్రమే!
అగ్నివీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవీ యాక్ట్ 1957, ప్రకారం నేవీలో 4 సంవత్సరాలు మాత్రమే సేవలందిస్తారు. నౌకాదళంలోని ర్యాంకులకు భిన్నమైన ర్యాంక్ ఈ అగ్నివీర్లది.
వయోపరిమితి
ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2003 నోటిఫికేషన్ ప్రకారం, నేవీలో అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2002 నవంబర్ 1 నుంచి 2006 ఏప్రిల్ 30లోపు జన్మించినవారై ఉండాలి. అంటే సుమారు 17 నుంచి 21 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
విద్యార్హతలు
అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించిన బోర్డు స్కూల్ పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కచ్చితంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్ట్ కూడా చదవి ఉండాలి.
జీతభత్యాలు
అగ్నివీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,500; నాలుగో ఏడాది రూ.40,000 చొప్పున జీతం ఇస్తారు. వీటితో పాటు ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. అభ్యర్థుల బేసిక్ శాలరీలో 30 శాతానికి సరిపడా సొమ్ము కార్పస్ ఫండ్‌గా ఉంటుంది. ఈ విధంగా నాలుగేళ్లకు అగ్నివీర్లకు రూ.10.04 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ అందుతుంది.
ఎంపిక విధానం
అభ్యర్థులకు మొదటిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత రాత పరీక్ష, పీఎఫ్‌టీ (శారీరక దృఢత్వ పరీక్షలు) , మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులను అగ్నివీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇతర విధానాల్లో అప్లై చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ 2023 జూన్ 15.
పరీక్ష ఫీజు
అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్ష ఫీజు రూ.550లతో పాటు అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు కట్టినవారికి మాత్రమే అడ్మిట్‌కార్డులు వస్తాయి. ఈ విషయం అభ్యర్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.