తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్ఠంభన నెలకొన్న పలు ప్రాంతాల నుంచి భారత్-చైనా బలగాలు వెనుదిరగగా.. మిగిలిన ప్రాంతాల్లో విభేదాలను పరిష్కరించుకునేందుకు ఈనెల 20న భారత్-చైనా ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిపాయి. ఇరు దేశాధినేతలు సూచించిన మార్గదర్శకాల మేరకు నిజాయితీగా, లోతుగా, సరైన దిశలో చర్చలు జరిపినట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మిగిలిపోయిన సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనేందుకు చర్చలు కొనసాగించినట్లు ఇరుదేశాల సైనిక ప్రతినిధులు తెలిపారు.
17వ విడత భారత్-చైనా కోర్ కమాండర్ స్థాయి సమావేశం చుషుల్-మోల్దో సరిహద్దు వద్ద చైనా వైపు నిర్వహించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్మాణాత్మకంగా ఇచ్చిపుచ్చుకున్నట్లు వివరించారు.
తూర్పు లద్దాఖ్ ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్‌గా భారత ప్రభుత్వం పేర్కొంది. పశ్చిమసెక్టార్ భూభాగంలో భద్రతను, స్థిరత్వాన్ని కొనసాగించాలని ఇరుదేశాల సైన్యాలు మధ్యంతరంగా నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. సైనిక, దౌత్యపరమైన మార్గాల ద్వారా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా కనుగొనేందుకు ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
డిసెంబరు 9న భారత్-చైనా సేనల మధ్య తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే వద్ద ఘర్షణ నేపథ్యంలో 17వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా సేనలు ఏకపక్షంగా సరిహద్దులను మార్చే ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్న భారత్ బలగాలు ప్రత్యర్థులను తరిమికొట్టాయి. భారత బలగాలు గొప్ప సంకల్పంతో కూడిన పరిష్కార పూరిత వైఖరిని కనబరిచాయని ఈ ఘర్షణపై పార్లమెంటులో ప్రకటన చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భౌతిక ఘర్షణలో భారత సైన్యం ధైర్యంగా చైనా సైన్యాన్ని ఎదుర్కొన్ని మన భూభాగాన్ని ఆక్రమించకుండా కాపాడినట్లు తెలిపారు. చైనా సైన్యాన్ని తిరిగి వారి స్థానాలకు పంపినట్లు వివరించారు.
భారత సైన్యానికి ప్రాణ నష్టంగానీ, తీవ్రమైన గాయాలుకానీ కాలేదని రక్షణమంత్రి తన ప్రకటనలో చెప్పారు. తవాంగ్ ఘర్షణపై స్థానిక కమాండర్, చైనా కమాండర్‌తో డిసెంబరు 11న ప్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా శాంతిని, సుస్థిరతను నెలకొల్పాలని చైనాను కోరినట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.