ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిలో కోటీశ్వరులున్నట్లు తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే, తాజాగా కాన్పుర్‌లో ఏకంగా 256 మంది చిరువ్యాపారులకు కోట్ల రూపాయల్లో ఆస్తిపాస్తులున్నట్లు ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వీరంతా ఆదాయపు పన్నులు చెల్లించడం లేదు సరికదా.. జీఎస్‌టీ పరిధిలో లేకపోవడం గమనార్హం. కాన్పూర్‌లోని కొందరు స్క్రాప్ డీలర్ల వద్ద మూడేసి కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక లాల్‌బంగ్లా ప్రాంతంలోని ఓ స్క్రాప్ డీలర్, బెకోన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు గత రెండేళ్లలో రూ.10కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
రూ.లక్షల అద్దె- రూ.కోట్ల ఆస్తులు..
ఈ వ్యాపారులు జీఎస్‌టీలో నమోదు చేసుకోలేదు సరికదా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు. ఈ 256 మంది చిరు వ్యాపారులు గత నాలుగేళ్లలో రూ.375 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బృహానా రోడ్డు వంటి ఖరీదైన కమర్షియల్ ప్రాంతాల్లోనే ఈ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. కరోనా మహమ్మారితో యావత్ భారతం విలవిల్లాడుతున్న సమయంలో ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు పాన్ షాపు యజమానులు, స్వరూప్ నగర్‌లో ఒక పాన్ దుకాణాదారుడు రూ.5కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. మాల్‌రోడ్డు ప్రాంతంలో ఓ చిరుతిళ్ల వ్యాపారి పలు ప్రాంతాల్లోని తన బండ్లకు నెలకు రూ. 1.25లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తేలింది. ఓ ఛాట్ వ్యాపారికి పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లు తెలిసింది.
ప్రభుత్వం కన్నుకప్పడానికి కొందరు చిరువ్యాపారులు సహకార బ్యాంకులు, చిన్న మొత్తాల పథకాల సాయం తీసుకుంటున్నారని, మరికొందరు తమ బంధువుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది. అయితే, వీరి పాన్ కార్డులు, ఆధార్ కార్డులను పరిశీలించగా.. ఈ ఆస్తుల చిట్టా బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలోనూ ఇలాంటి కోటీశ్వరులైన 'పేదవాళ్ల' గురించి పలుమార్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చూడండి: 'మీడియా'పై ఐటీ దాడులు- రాజకీయంగా దుమారం