ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. రూ.10 లక్షలకు ఇస్తేనే తన భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లి తొలి రాత్రి జరుపుకుంటామని అత్తమామలకు చెప్పాడు. దీంతో వారు అతడికి హనీమూన్ ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇచ్చారు. తీరా హానీమూన్‌కు వెళ్లాక.. భార్యను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా తన పుట్టింటి నుంచి మరో రూ. 5లక్షలు తెస్తేనే హనీమూన్ జరుగుతుందని చెప్పాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పీలీభీత్ జిల్లాలోని బదాయూ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన నిందితుడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీలీభీత్ నగరంలో ఉంటున్న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లికి వధువు కుటుంబసభ్యులు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. కట్నం రూపంలో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు కూడా ఇచ్చారు. కానీ అతడు పెళ్లి తర్వాత తొలి రాత్రి జరుపుకోలేదు. భార్యను హానీమూన్‌కు కూడా తీసుకెళ్లలేదు. ఎప్పుడూ ఆమెతో దూరంగా ఉండేవాడు. ఈ విషయాన్ని ఆమె తన అత్తగారికి చెప్పినా పట్టించుకోలేదు.
కొన్నిరోజుల క్రితం.. బాధితురాలు తన పుట్టింటికి వెళ్లింది. తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఏప్రిల్ 12వ తేదీన నిందితుడు.. తన భార్యను తీసుకెళ్లేందుకు అత్తవారింటికి వెళ్లాడు. ఆ సమయంలో అతడితో బాధితురాలి తల్లి మట్లాడింది. "ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పండి. చికిత్స చేయిస్తాం. కానీ ఇలా భార్యాభర్తల మధ్య దూరం సరికాదు" అని అల్లుడితో చెప్పింది. వెంటనే అతడు రూ.10 లక్షలు ఇస్తే తన భార్యతో హానీమూన్‌కు వెళ్తానని చెప్పాడు. దీంతో అతడికి అత్తామామలు హనీమూన్ కోసం రూ.5 లక్షలు ఇచ్చారు.
ఆ తర్వాత మే7వ తేదీన భార్యాభర్తలిద్దరూ హానీమూన్ కోసం నైనితాల్ వెళ్లారు. అక్కడి వెళ్లాక శృంగారంలో తన భర్త పాల్గొనలేదని బాధితురాలు ఆరోపించింది. అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీశాడని ఆరోపణలు చేసింది. మరో రూ.5 లక్షలు తీసుకురాకపోతే అశ్లీల వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడని చెప్పింది. ఆ రూ.5 లక్షలు తెచ్చాకే హానీమూన్ జరుపుకుందామని చెప్పాడని తెలిపింది. భర్త చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు.. తిరిగి మే 13న తన పుట్టింటికి చేరుకుంది. జరిగినదంతా తన కుటుంబసభ్యులకు వివరించింది. ఆ తర్వాత బాధితురాలు పీలీభీత్ పోలీస్ స్టేషన్‌లో అత్త, భర్తపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా వేధింపులు, వరకట్నం డిమాండ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.