Human sacrifice in Maharashtra: గుప్త నిధుల వేటలో కొందరు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులను బలిస్తే ఎన్నడూ చూడనంత సంపద లభిస్తుందని కొందరు చెప్పే కట్టుకథలను నమ్మి సొంత వారిని సైతం బలిచేసేందుకు వెనకాడటం లేదు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల కోసం 18 ఏళ్ల కన్న కూతురినే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ తండి. గత సోమవారం బాబుల్గావూన్ తహసీల్‌లోని మద్ని గ్రామంలో గుప్తు నిధుల కోసం బలి ఇస్తున్నారని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తాంత్రికుడు, బాలిక తండ్రితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఇదీ జరిగింది: నిందితుల్లో ఒకరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు బంధువుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఇటీవలే తన సొంత ఊరికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి బెదిరించాడు తండ్రి. ఆ తర్వాత ఇంట్లో తాంత్రిక పూజలు చేయటం ప్రారంభించాడు. తన కుమార్తెను సజీవంగా ఖననం చేసేందుకు ఏప్రిల్ 25న ఇంట్లోనే పెద్ద గొయ్యి తవ్వాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తన స్నేహితురాలికి సమాచారం చేరవేసింది. ఆమె పోలీసులకు చెప్పింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్ర పూజలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి బాలికను రక్షించినట్లు యావత్మాల్ ఎస్పీ దిలీప్ భుజ్బాల్ పాటిల్ తెలిపారు. హత్యాయత్నం(307), 376(అత్యాచారం), ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తుపాకులతో బెదిరించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: తుపాకులతో బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్, పట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌లో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు ప్రకారం.. గతం సోమవారం రాత్రి ఇద్దరు అక్కచెల్లెళ్లు బహిర్భూమికి వెళ్లారు. ఇద్దరు దుండగులు ఆయుధాలతో బైక్‌లపై అక్కడికి చేరుకుని వారిని బెదిరించారు. రాత్రంతా వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు అరిచేందుకు ప్రయత్నించగా చంపేస్తామని తుపాకీ చూపించారు.
తమ పేరు వికాశ్ కుమార్, సమీర్ కుమార్ అని, పోలీసులు సైతం తమను ఏమీ చేయలేరని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో నేరుగా ఖగౌల్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు బాధితులు. ఫిర్యాదు అందుకున్న కొన్ని గంటల్లోనే నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం: మహారాష్ట్రలోని ఠాణెలో ఓ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడిన రెండేళ్ల క్రితం నాటి కేసులో 27 ఏళ్ల వ్యక్తిని బంగాల్లో బుధవారం అరెస్ట్ చేశారు పోలీసులు. ఠాణెలోని ఉల్హాస్నగర్ టౌన్షిప్లో నిందితుడు మేస్త్రీగా పని చేసేవాడు. బాలిక(ప్రస్తుతం 16 ఏళ్లు)ను అపహరించి బంగాల్లోని తన సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బాలిక కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తిపై కిడ్నాప్ కేసు పెట్టారు.
ఇటీవలే నిందితుడి సమాచారం తెలుసుకున్న ఠాణె పోలీసులు.. బంగాల్, ముర్షీదాబాద్ జిల్లాలోని బుర్వాన్ గ్రామానికి మంగళవారం చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హిల్ లైన్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. దివ్యాంగురాలిని చెట్టుకు కట్టేసి..