Gujarat Elections 2022 Second Phase: గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14జిల్లాల పరిధిలోని 93నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ఈనెల ఒకటిన 89స్థానాలకు పోలింగ్ జరిగింది. 63.34 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 3శాతానికిపైగా ఓటింగ్ శాతం తగ్గింది.
రెండో విడత పోలింగ్ జరుగనున్న 93స్థానాలకుగాను అన్నిపార్టీల తరఫున 833మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 26,409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఓటింగ్ కోసం 36వేలకు పైగా ఈవీఎంలు వినియోగిస్తుండగా 1,13,325 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నట్లు గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 5న జరగబోయే రెండో విడత గుజరాత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సబర్మతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న నిషాన్ స్కూల్లో ఆయన ఓటు వేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పలువురు ప్రముఖులు
గుజరాత్ రెండోవిడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్, వీరమ్‌గామ్ నుంచి పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్, దక్షిణ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న వీరిద్దరు.. ఈసారి భాజపా తరఫున బరిలో నిలిచారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆప్ ప్రవేశంతో త్రిముఖ పోరు..
కొన్ని దశాబ్దాలుగా ద్విముఖ పోటీ నెలకొన్న గుజరాత్‌లో ఈసారి ఆప్ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. 27ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ.. వరుసగా ఏడోసారి విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. 1995 నుంచి గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఆరుసార్లు వరుసగా గెలుపొందింది. ఈసారి కూడా గెలుపొందితే.. పశ్చిమ బంగాల్‌లో వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన వామపక్ష కూటమి రికార్డ్‌ను చేరుకుంటుంది.
బంగాల్‌లో వామపక్ష కూటమి 1977 నుంచి 2011 వరకు అధికారంలో కొనసాగింది. 2017 ఎన్నికల్లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చిన హస్తం పార్టీ ఈసారి ఎలాగైనా ప్రధాని మోదీ ఇలాఖాలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇటీవల పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ..అదే ఉత్సాహంతో గుజరాత్‌లోనూ పాగా వేయాలని గట్టిగానే పావులు కదిపింది. పలు ఉచిత హామీలతోపాటు విద్య, వైద్యంలో దిల్లీ అభివృద్ధి నమూనాపై పెద్దఎత్తున ప్రచారం చేసింది.